నక్సలైట్ల తుపాకీ గుండ్లకు నేలకొరిగిన జిత్తన్న

కేశవరాజు                                                                                                                                                                   * సంస్మరణ 
స్ఫురద్రూపి , నునూగు మీసాల యవ్వన ప్రాయుడయిన  ముదిగంటి జితేందర్ రెడ్డి (జిత్తన్న) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరి దేశంకోసం, తను పుట్టిన సమాజం కోసం, జ్ఞానము శీలము సమాజ ఐకమత్యాన్ని పెంపొందించే  అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న క్రమంలో ఈ పనులు నచ్చని  దేశ వ్యతిరేకులు, విదేశీ తొత్తులైన నక్సలైటు నరహంతకులు 1987 ఏప్రిల్ 9న పొట్టన పెట్టుకున్నారు. వారి జీవితం అప్పటి తరానికే కాదు ఈ తరానికి కూడా ఆదర్శం.

జగిత్యాలకు తమ  స్వగ్రామం మ్యాడంపల్లి  నుండి తిరిగి వస్తుండగా దారికాచి గుట్టల వెనుక పొంచి ఉండి వెనక, ముందు కుడి ఎడమలుగా.., నాలుగు వైపుల నుండి ఒకేసారి పదుల సంఖ్యలో నక్సలైట్లు తుపాకులతో కాలుస్తూ వెంబడించారు. వారిని ఎదుర్కొంటూ (తనకు రక్షణగా ఉన్న తుపాకీని ఆ సమయంలో  వచ్చిన ఎన్నికల కారణంగా పోలీసులు స్వాదీనం చేసుకోగా)  రక్షణ కోసం వెంట ఉన్న పోలీస్ (బాడీగార్డ్) తుపాకీని జారవిడిచి పారిపోగా (ఇతడే జిత్తన్న రాకపోకలను నక్సలైట్లకు అందించాడని కొందరు అంటుండగా తెలిసింది) అదే తుపాకీని చేతబూని దుర్మార్గుల పై విరుచుకుపడ్డాడు. ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

గంటల సమయం  గడిచిపోతున్నది. తనను చంపడానికి వచ్చిన శత్రువులలో కొందరు యమపురికి వెళ్లినట్టు, మరికొందరు గాయాలతో పారిపోయినట్లు  సమాచారం. నక్సలైట్ల తుపాకులలోని  వందలాది బుల్లెట్లు  తగిలి  అక్కడి గుట్టలు, రాళ్లు రప్పలు  పగిలిపోతున్నాయి బుల్లెట్లు వృధా  అయ్యాయి కానీ జితేందర్ వాళ్లకు లొంగిపోలేదు, పట్టుబడలేదు. 
 
ఈ క్రమంలోనే సాయంత్రం కావస్తుండగా తుపాకీ చప్పుడు ఆగిపోయిన విషయాన్ని గమనించి ఆ వైపు వెళ్లిన నక్సలైట్లు రక్తపుమడుగులో చంద్రశేఖర్ ఆజాద్ మాదిరిగా  స్పృహతప్పి పడివున్న జిత్తన్నను చూసి తుపాకులతో కసితీరా కాల్చి కాల్చి వికృతానందాన్ని పొందారు. (వారి శరీరంలో 120 బుల్లెట్లు దిగినట్టు పోస్టుమార్టం రిపోర్టు సమాచారం).
ఇలా “ఒక జాతీయ విప్లవ కెరటం అందనంత ఎత్తుకు ఎగిసి మాయమైంది – “జిత్తన్న ఆకాశంలో నక్షత్రమయ్యాడు””.  జిత్తన్న తండ్రి ముదిగంటి మల్లారెడ్డి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రాంత కార్యవాహ. గతంలో మల్యాల తాలూకా సమితి ప్రెసిడెంటుగా కూడా పని చేశారు. నిబద్ధతతో కూడిన వ్యక్తిగత జీవనం, సామాజిక జీవనం కలిగిన వీరు సహజంగానే రాజకీయాలలో ఇమడలేకపోయారు.

స్వచ్ఛమైన జాతీయ భావాలకు దేశభక్తికి రూపమైన ఆర్ఎస్ఎస్ లో  చేరి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సహజంగానే తన కుటుంబాన్ని పిల్లలను దేశభక్తులుగా మలుచుకున్నాడు. సుఖంగా సాగుతున్న వారి కుటుంబంలో నక్సలైట్లు చిచ్చుపెట్టారు అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పెద్ద కుమారుడిని హత్యచేశారు.

1986లో వరంగల్ జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు, విచిత్ర రాజకీయ చదరంగంలో నక్సలైట్లు అధికారపార్టీకి దాసోహం అంటూ, సహకరిస్తూ, తాము బలపడడానికి ప్రయత్నిస్తున్న వైనాన్ని చెబుతూ ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే అనేకమంది అమాయకులు బలి అవుతారు అంటూ వారు చేసిన హెచ్చరికలు నా చెవుల్లో  ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉన్నాయి .

తన కుమారుని గురించి చెబుతూ అప్పటికే చాలాసార్లు దాడులు జరిగాయని నక్సలైట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయగా లభించిన స్వేచ్ఛతో  బలాన్ని పెంచుకున్న నక్సలైట్లు మళ్లీ దాడులు చేస్తారని బహుశా అతని ప్రాణాలకు ముప్పు జరగవచ్చని ..,  “మా అందరి ముందే చెప్పడం మా మనసులను కలచివేసింది.”

తెలంగాణ జిల్లాల్లో నక్సలిజం పేరుతో ఒకవైపు పేద ప్రజలకు మేలు చేస్తున్నామంటూనే  వేలాది మందిగా హరిజన గిరిజన బడుగు పేద ప్రజలను పోలీసుల పైకి ఉసిగొలిపి, బలిదానాలు చేయండి అంటూ పాటలు పాడి రెచ్చగొట్టి వేలాదిమంది చావడానికి, హత్యలు చేసి జైలుపాలు కావడానికి, వేలాది మంది ఇల్లు వాకిలి వదిలి  అడవులు గుట్టల వెంట కష్టాలు పడుతూ ఏ రోజు చస్తామో, ఏరోజు  తినడానికి ఏమి దొరుకుతుందో తెలియక  ఘోరమైన  దుర్భరమైన జీవితాలు గడిపి  చచ్చేవాళ్ళు కొందరైతే , పోరాటంలో భాగం అంటూ ఇంటిలోని భార్య పిల్లలు  అమ్మ నాన్న  అక్క చెల్లెల జీవితాలు కూడా  గందరగోళానికి గురి చేసినవాళ్ళు కొందరు.

నానా కష్టాలు పడడానికి, బలిదానం కావడానికి  పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు, ఉద్యమానికి  నాయకత్వం వహించే వాళ్ళు  మాత్రం   రాజకీయ పార్టీలతో , నాయకులతో, కాంట్రాక్టర్లతో  కుమ్మక్కై  వందల కోట్ల రూపాయలు  సమీకరించుకొని  చల్లగా  జారుకొని పోయి రాజకీయ ఆశ్రయం పొంది భువనగిరి ‘నయీం’, జడల నాగరాజు వంటి  వారిమాదిరిగా పోలీసు ఇన్ఫార్మర్లుగా, తదనంతరం దోపిడీ దొంగలుగా మారేవాళ్ళు కొందరైతే ‘మీకు తెలిసిన అనేకమంది వలే రాజకీయ నాయకులుగా మారి ప్రజల్ని మోసం చేసిన వాళ్లు అనేకం’ .

మరో ఉదాహరణ ‘గద్దర్’

వేషం మార్చి దశాబ్దాలుగా పార్టీ రాజకీయాలను వ్యతిరేకించి అసెంబ్లీ పార్లమెంట్ లను నమ్మని  వాడిగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని పనిచేసిన నక్సలైట్లు, యువకులను పాటలతో ఆటలతో రెచ్చగొట్టి అడవుల పాలు చేసిన  ఈవ్యక్తి సోనియాగాంధీ దగ్గరికి వెళ్లి తన కొడుకుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వమని చేతులు జోడించుకొని అడిగిన మాదిరిగా అన్నమాట .

లొంగిపోయిన ప్రతి నక్సలైట్ నాయకుడు  చేసేపని ఇదే . రాజకీయాల్లో చేరి పోవడం,  లేదా కోట్ల రూపాయలు ప్రజలను దోచుకుని సంపాదించిన ధనాన్ని వెంట తెచ్చుకొని వ్యాపారాలు చేసుకోవడం.., ఇదే వీళ్లు నేర్చిన నక్సలిజం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఫలాలను  చవి చూస్తున్న ప్రాంతాలు  గతంలో వీరి పనికిమాలిన సిద్ధాంతం ప్రభావం కారణంగా తెలంగాణ, చత్తీస్గడ్, ఝార్ఖండ్, బెంగాల్ వంటి ప్రాంతాలు అభివృద్ధి లేక నాశనం అయిపోయినవే.

ప్రజాసంక్షేమం అనే మాట ఏనాడో వాళ్లు వ్రాసి పెట్టిన  పుస్తకాలలోనే వదిలిపెట్టారు. ఇప్పుడు తాము, తమ కుటుంబం, తమ పార్టీ సంక్షేమము మాత్రమే వారికి తెలుసు ఇంకా కొందరికి వారి కులం పిచ్చి కూడా ముదిరి పాకాన పడింది…,  వీటి కొరకు పేద ప్రజల కుటుంబాలను బలి పెడతారంతే. బతుకు బండి లాగడానికి పోలీసు ఉద్యోగంలో చేరిన వేలాది మందిని టార్గెట్ చేసి హత్యలు చేసి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గపు రక్త చరిత్ర నక్సలైట్లది.

ఇటువంటి నక్సలైట్లకు దేశభక్తిని ప్రబోధించే,  విదేశీ విధానాలను వ్యతిరేకించే, స్వదేశీ, స్వాతంత్ర్యాన్ని కోరే  వ్యక్తిగా, స్వభాష , స్వధర్మనిష్ఠ కలిగిన వ్యక్తిగా ,
ధర్మం కోసం పనిచేస్తున్న జితేందర్ రెడ్డి గారిని హత్య చేయడానికి… మృత్య ప్రాంగణంలో  తచ్చట్లాడే  నక్సలైట్లకు పెద్ద కారణం అవసరం లేదు.

ధర్మ రక్షణకై తన ప్రాణాలను బలిపెట్టిన వీర కిశోరం, అమరులు ముదిగంటి జితేందర్ రెడ్డి బలిదానం వృధా కాదు. వారి శరీరంలో దిగిన  120 బుల్లెట్ల ధాటికి చిందిన రక్తపు ధారల సాక్షిగా చెబుతున్నాను బూటకపు నక్సలైటు సిద్ధాంతం నాశనమైపోయింది. జితేందర్ రెడ్డి చిందించిన ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి వేలాది మందిగా జాతీయ వీరులు పుడతారు. దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తారు. విదేశీ భావ చీకట్లు తొలగి కాషాయపురంగు సూర్యుడు ఉదయించ బోతున్నాడు. భారతదేశం ముందు ప్రపంచమే మోకరిల్లే సమయం ఆసన్నమైనది.