తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు

“తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము” అని భజరంగ్ దళ్ హెచ్చరించింది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ, ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి  పండరీనాథ్ , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడారు. తొలుత హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు. 

ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై పెరుగుతున్న దాడులను  అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందని వారు స్పష్టం చేశారు.

భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అంటూ మండిపడ్డారు. 

అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడిపై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందని దుయ్యబట్టారు. 

నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్య అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు.