ఏపీ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు

బిజెపి అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ లో 10అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేనలతో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ,  6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ  బుధవారం సాయంత్రం అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. 
 
లోక్ సభ ఎన్నికలలో పోటీకి ఆసక్తి ప్రదర్శించి, సర్దుబాట్లలో సీట్లు లభించకపోవడంతో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనున్నారు. అదే విధంగా మాజీ శాసనసభ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాసరావు తిరిగి తమ పాత స్థానాల నుండి పోటీ చేస్తున్నారు.

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

  • ఎచ్చెర్ల- ఎన్‌. ఈశ్వర్‌రావు
  • విశాఖ నార్త్‌- పి. విష్ణుకుమార్‌ రాజు
  • అరకు లోయ (ఎస్)- పంగి రాజారావు
  • అనపర్తి- ఎం. శివకృష్ణం రాజు
  • కైకలూరు- కామినేని శ్రీనివాసరావు
  • విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి
  • బద్వేల్‌ (ఎస్టీ)- బొజ్జ రోషన్న
  • జమ్మలమడుగు- సి. ఆదినారాయణరెడ్డి
  • ఆదోని- పీవీ పార్థసారథి
  • ధర్మవరం- వై. సత్యకుమార్‌

కూటమి పొత్తుల్లో 10 అసెంబ్లీ స్థానాలకు అంగీకరించిన బిజెపి స్థానిక నేతల ఒత్తిళ్లతో మరో సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే జనసేన మూడు సీట్లు బిజెపి కోసం వదులకుంది. టీడీపీ, జనసేన చర్చల్లో ముందు పవన్ పార్టీకి 24 సీట్లు కేటాయించగా బిజెపితో పొత్తు కోసం 21 సీట్లకే పరిమితమయ్యారు. అదేవిధంగా, బిజెపి కోసం టిడిపి ఒక స్థానం వదులుకుంది.