`ఇంటింటి ప్రచారం’కు ముందస్తు అనుమతి నిబంధన నిలిపివేత

ఎన్నడూ లేని విధంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు కూడా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని తాజాగా విధించిన నిబంధనను ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో అమలును ఎన్నికల కమిషన్ నిలిపివేసింది.

ఏపీలో రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతి తీసుకున్నాకే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలంటూ ఈసీ తాజాగా కొత్త నిబంధన పెట్టింది. దీనిపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. సువిధ యాప్ లో ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని ఈసీ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లాయి. 
 
దీంతో సమీక్ష నిర్వహించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అనుమతి పొందిన తదుపరే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే నిబంధన అమలు దుస్సాధ్యమని, ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరుతున్నాయని సీఈవో మీనా తెలిపారు. 
 
ఈ నిబంధన అమలు విషయంలో పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఈ అంశంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు తెలియజేస్తామని ఆయన ప్రకటించారు.  
 
రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సీఈఓ ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు. దీంతో ఈ నిబంధనను  ప్రస్తుకానికి అమలు చేయడంలేదని ప్రకటించారు. హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక జెండాను మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు.