అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ విధులు

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పోలింగ్‌ విధులకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒప్పంద ఉద్యోగులను వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉన్నందున వీరి సేవలను వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని తెలిపారు. 
 
పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తు ఫాం-12 స్వీకరణ గడువును మే ఒకటో తేదీ వరకు పొడిగించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో గడువు ముగియగా.. దీన్ని పొడిగించారు. పోలీసులు, ఇతర అన్ని శాఖల పోస్టల్‌ నోడల్‌ అధికారుల జాబితా, పోస్టల్‌ బ్యాలట్లపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలని ఆదేశించారు.
 
పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారు అన్ని నిబంధనలు చదివి హడావుడి లేకుండా నిర్దేశించిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు­హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్ని­కల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ప్రతి ఓటు చెల్లేవిధంగా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలంటూ పలు సూచనలు ఇచ్చింది. 
 
సర్వీసు ఓటర్లకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా అవకాశం కల్పిస్తుండగా మిగిలిన వారు రిటర్నింగ్‌ అధికారి నిర్దేశించిన తేదీల్లో ఏర్పాటు చేసిన ఓటర్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటుహక్కు వినియోగించుకోవాలి. హోమ్‌ ఓటింగ్‌ ఎంచుకున్న వారు రిటర్నింగ్‌ అధికారి ఏర్పాటు చేసిన పోలింగ్‌ టీమ్‌ సహకారంతో ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.
 
మరోవైపు సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలకు సదుపాయాలు కల్పించాలని ముకేశ్‌కుమార్‌ మీనాకు మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి వినతిపత్రం అందజేశారు. కడప జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణులకు కల్పిస్తున్న సదుపాయాలు తనిఖీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 
 
చిన్న పిల్లలతో వచ్చే బాలింత లకు, గర్భవతులకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని,  గర్భవతులకు అత్యవసరమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నాటికి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్ట్యా మహిళలు వడ దెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్, త్రాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆమె పేర్కొన్నారు. 
 
అత్యవసర సందర్భాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపుల విషయాల్లో వారికి తగిన న్యాయం చేయడం కోసం బాధితులను పరామర్శించడానికి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, సభ్యులకు ఎన్నికల నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కోరినట్లు వెంకటలక్ష్మి తెలిపారు.