సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ రికార్డు

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పిందని పోర్టు కార్యదర్శి టి వేణుగోపాల్‌ తెలిపారు. అర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగు రోజులు మిగిలి ఉండగానే పోర్టు చరిత్రలోనే మొదటి సారి 80 (80.05ఎంఎంటిపిఎ) మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రికార్డును అధిగమించిందని పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది క్రూడ్‌ ఆయిల్‌ రవాణాలో 27 శాతం, ఇనుప ఖనిజం 12 శాతం, ఎరువులు ఆరు శాతం పెరుగుదలను నమోదు చేశాయని తెలిపారు. 43 భీమ్‌ కలిగిన బేబీ కేప్‌ నౌకలు గత ఏడాదితో పోల్చుకుంటే అధికంగా ఇన్నర్‌ హార్బర్‌లో కార్యకలాపాలు నిర్వహించాయని వివరించారు. పోర్టులోనికి వచ్చిన నౌకలలో సైతం 35 శాతం పెరుగుదల నమోదైందని చెప్పారు. 
 
విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ సైతం 28 శాతం అధికంగా 6.65 లక్షల టిఇయులను హ్యాండిల్‌ చేసిందని తెలిపారు. ప్రి బెర్తింగ్‌ డిటెన్షన్‌లో 68 శాతం, టర్న్‌ అరౌండ్‌ టైం, అవుట్‌ పుట్‌ ఫర్‌ షిప్‌ బెర్త్‌ డేలో పది శాతం, ఐడల్‌ టైం బెర్తింగ్‌లో ఎనిమిది శాతం మెరుగుదలను నమోదు చేసిందని చెప్పారు. 2023 మే, జూన్‌, అక్టోబర్‌, జనవరి 2024 నెలలో అత్యధిక సరుకు రవాణా రికార్డులను నమోదు చేసిందని తెలిపారు. 
 
2023 జూన్‌ 17 చేసిన ఎగుమతులు, దిగుమతుల్లో 4,01,875 మిలియన్‌ టన్నుల ఒక్క రోజులో అత్యధిక సరుకు రవాణా రికార్డును తిరగరాసిందని వివరించారు.  ఈ ఘనతను సాధించడం పట్ల పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. నూతన రికార్డును సృష్టించడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్‌ మేనేజర్‌, అతని బృందాన్ని ప్రశంసించారు. పోర్టు ఉద్యోగులు మరింత శ్రమించడం ద్వారా నూతన రికార్డులను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.