టీడీపీ తుది జాబితా విడుదల

 
* 4 ఎంపీ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
 
4 లోక్‍సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది.  విజయనగరం టిడిపి ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇక అనంతపురం టిడిపి ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మినారాయణ, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి అవకాశం దక్కింది. ఫలితంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

ఎంపీ అభ్యర్థులు

  1. విజయనగరం – అప్పలనాయుడు,
  2. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
  3. అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
  4. కడప – చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి.

తాజాగా విడుదలైన ఎమ్యెల్యే అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కింది. భీమిలి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావుకు అవకాశం దక్కింది. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి జయరామ్ కు గుంతకల్లు సీటు ఖరారైంది.

ఎమ్మెల్యే అభ్యర్థులు

  1. చీపురుపల్లి – కళా వెంకట్రావు
  2. బీమిలి – గంటా శ్రీనివాసరావు
  3. పాడేరు – వెంకట రమేష్ నాయుడు
  4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
  5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
  6. ఆలూరు – వీరభద్ర గౌడ్
  7. గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్
  8. అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్
  9. కదిరి – కందికుంట వెంకట ప్రసాద్

తుది జాబితాలో కూడా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టికెట్ దక్కలేదు. ఆయన ఆశించిన మైలవరంతో పాటు మరో చోట కూడా టికెట్ ఖరారు కాలేదు. దీంతో ఆయన అధినాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఆయనకు విజయవాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పగించారు. 

 ఇక గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఎట్టకేలకు భీమిలినే ఖరారు అయింది. మొదట్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన తనకు మిత్రుడైన వైసిపి అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీచేసే ప్రసక్తి లేదని మొండిపట్టుదల పట్టడం, విశాఖపట్నం జిల్లాలో ఏ నియోజకవర్గంగా పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఆదుకు చంద్రబాబునాయుడు  లొంగిరాక తప్పలేదు. 

 దీంతో మరోసారి భీమిలి నుంచే గంటా బరిలో ఉండనున్నారు. ఇక అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ కు అవకాశం ఇచ్చింది టీడీపీ. వీటితో పాటు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చింది.  కదిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదాదేవికి గతంలో టికెట్ కేటాయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై ఉన్న నకిలీ డీడీల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేయటంతో ఇప్పుడు తిరిగి కందికుంటకే టికెట్ ఇచ్చారు.