పొరుగు దేశం పాకిస్థాన్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్ ప్రావిన్సుల్లోని తుర్బాత్ వద్ద ఉన్న పాక్‌లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్‌స్టేషన్ పీఎన్‌ఎస్ సిద్ధిఖ్ పై సోమవారం రాత్రి దాడి చేశారు. పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో నావల్ ఎయిర్‌స్టేషన్ స్థావరంపై విరుచుకుపడ్డారు. వైమానిక స్థావరంలో పలు పేలుళ్లు, కాల్పులు చోటుచేసుకున్నట్టు పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఈ దాడిలో పలువురు సైనికులు మృతిచెందినట్టు తెలిపింది.
వెంటనే అప్రమత్తమైన సైనికులు, పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. ఎయిర్‌స్టేషన్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు నిషేధిత ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ బాధ్యత వహించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బలూచిస్థాన్ వనరులపై చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా ఈ చర్యకు దిగినట్టు పేర్కొంది. తమ సభ్యులు చైనా డ్రోన్‌లు ఉన్న ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి, దాడిచేసినట్టు చెప్పింది. తమ కాల్పుల్లో డజనుకు పైగా పాకిస్థానీ బలగాలు మృతి చెందినట్లు తెలిపింది. అయితే పాకిస్థాన్ సైన్యం మాత్రం దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.
ఉగ్రదాడితో అప్రమత్తమైన అధికారులు.. తుర్బాత్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్యుల సెలవులను రద్దుచేసిన జిల్లా ఆరోగ్య అధికారి.. అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, వారం రోజుల వ్యవధిలో బలూచ్ ఆర్మీ చేసిన రెండో దాడి కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ మూడోది.
జనవరి 29న మాచ్ నగరం, మార్చి 20 గ్వాదర్‌లోని పాక్ మిలటరీ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై బీఎల్ఏ మజీద్ బ్రిగేడ్ దాడులు చేసింది. గ్వాదర్ పోర్టుపై జరిగిన దాడిలో ఇద్దరు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మార్చి 20 ఎనిమిది మంది టెర్రరిస్టుల బృందం పోర్ట్ అథారిటీ కాలనీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి అని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది.
కాగా, చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్)లో గ్వాదర్ పోర్ట్ అత్యంత కీలకమైంది. దీంతో చైనా భారీగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను బలూచిస్థాన్ ప్రావిన్సుల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా ఈ ప్రాజెక్ట్ పేరుతో వనరులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, నవంబరు 2022లో తెహ్రీక్-ఇ-తాలిబన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం రద్దుచేసుకున్న తర్వాత ఇటీవల పాకిస్థాన్‌లో ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయి.
ఐదుగురు చైనా జాతీయులతో సహా ఆరుగురు మృతి
ఇలా ఉండగా, మంగళవారం ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని షాంగ్లాలోని బిషమ్ తహసీల్‌లో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం మరొక వాహనంపై ఢీకొట్టింది, ఫలితంగా ఐదుగురు చైనా జాతీయులతో సహా కనీసం ఆరుగురు మరణించారు.వాయువ్య పాకిస్తాన్‌లో వారి కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినప్పుడు పేలుడులో చైనా జాతీయులు మరణించారు.
ఇస్లామాబాద్ నుండి ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని దాసులోని వారి శిబిరానికి వెళుతున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని ఢీకొట్టాడని ప్రాంతీయ పోలీసు చీఫ్ మహ్మద్ అలీ గండాపూర్ వార్తా సంస్థకు తెలిపారు.ఈ దాడిలో ఐదుగురు చైనా పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మృతి చెందారని గండాపూర్ తెలిపారు.
నలుగురు ఉగ్రవాదులు కాల్చివేత
మరోవంక, పాకిస్థాన్ సెక్యూర్టీ దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్సులో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉగ్రవాదుల ఏరివేత జరిగినట్లు మిలిటరీ తెలిపింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ మిలిటెంట్లు, దళాల మధ్య తీవ్ర ఫైరింగ్ జరిగింది.
కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదులు.. అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. టుర్బత్‌లో ఉన్న సిద్దికీ నావల్ ఎయిర్ బేస్‌పై జరిగినదాడిలో ఉగ్రవాదుల్ని కాల్చివేశారు. ఫ్రంటైర్ కార్ప్స్ బలోచిస్తాన్ సైనికుడు కూడా ఒకరు మరణించారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు