నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను చంపారన్న ఆరోపణపై కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. నిజ్జర్ చంపివేత వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాక, భారత, కెనడా సంబంధాలు బలహీన పడ్డాయన్న సంగతి ఇక్కడ గమనార్హం. ట్రూడో ఆరోపణలు నిరాధారం అంటూ భారత్ కొట్టి పారేసింది. కెనడా ఆరోపణలు అర్థం లేనివి, ప్రేరేపితమైనవని భారత్‌ ఖండించింది.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ డేవిడ్ టెబౌల్ మాట్లాడుతూ సిక్కు కార్యకర్త నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు. హత్య కేసుతో పాటు, భారత ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై వేర్వేరు దర్యాప్తులు జరుగుతున్నాయని అన్నారని ‘టొరంటో స్టార్’ వార్తాపత్రిక నివేదించింది.

అనుమానితులను కరణ్ బ్రార్, కరణ్‌ప్రీత్ సింగ్,కమల్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. వీరంతా 20 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వీరిని శుక్రవారం ఎడ్మంటన్‌లో అరెస్టు చేశారన్నారు. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించినా వారి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిపింది. నిజ్జర్‌ హత్య కోసం భారత్‌ ఏర్పాటుచేసినట్టుగా చెబుతున్న హిట్‌స్వాడ్‌లో వీరు సభ్యులని అక్కడి మీడియా నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది జూన్‌ 18న సాయంత్రం సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.