భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్

బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మూడో టి20లో భారత మహిళా క్రికెట్ టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే భారత్ 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ విమెన్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 18.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. 

ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం అందించారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి టీమ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు మంధాన, అటు షఫాలీ కుదురుగా ఆడడంతో భారత్ సునాయాసంగా లక్ష్యం వైపు సాగింది.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ 38 బంతుల్లోనే 8 ఫోర్లతో 51 పరుగులు చేసింది. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించింది. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మంధాన 42 బంతుల్లో ఐదు బౌండరీలు, ఒక ఫోర్‌తో 47 పరుగులు చేసింది. తర్వాత వచ్చిన హేమలత (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. 

అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (6) నాటౌట్, వికెట్ కీపర్ రిచా ఘోష్ 8 (నాటౌట్) మరో వికెట్ నష్టపోకుండా జట్టుకు విజయం సాధించి పెట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. అద్భుత బౌలింగ్‌తో బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో బంగ్లా ఆశించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయింది.

రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, పాటిల్‌లు పొదుపుగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించలేక పోయారు. ఆతిథ్య టీమ్‌లో ఓపెనర్ దిలారా అక్తర్ (39), కెప్టెన్ నిగర్ సుల్తానా (28), శోభన (15) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా, ఇంతకుముందు జరిగిన తొలి రెండు టి20లలో కూడా భారత్ జయకేతనం ఎగుర వేసిన సంగతి తెలిసిందే.