ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి గర్భగుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు మరో ఎనిమిది మంది భక్కులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్నవారు వెంటనే వారిని స్థానిక దవాఖానకు తరలించారు.
 
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. పండుగ రోజును పురస్కరించుకొని   ప్రధాన గోపురం కింద ఉన్న గర్భ గృహంలో భస్మహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. 
 
అక్కడే ఉన్న ఓ వస్త్రం మంటలకు అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశీష్‌ కూడా ధ్రువీకరించారు. కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ  ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది గాయపడటంతో వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఇందౌర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. 
 
బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజరు గౌర్‌ కూడా ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణకు మెజిస్టీయల్ విచారణకు ఆదేశించారు. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

కాగా, ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ స్పందిస్తూ భస్మహారతి సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాని తెలిపారు. ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్‌ చేశారు.

గులాల్ రంగులో ఉన్న కెమిక‌ల్స్ వ‌ల్ల అగ్నిప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని  ఆ రాష్ట్ర మంత్రి కైలాస్ విజ‌య‌వ‌ర్గీయ్ అంచ‌నా వేశారు. అయితే, మ‌హాకాలేశ్వ‌ర్ ఆల‌యంలో హోలీ వేడుక‌ల్ని నిర్వ‌హించే సంప్ర‌దాయాన్ని తాము ఆప‌బోమని స్పష్టం చేశారు.  మ‌రోసారి ఎటువంటి కెమిక‌ల్స్ లేకుండా ఉండే గులాల్‌తో ఆడ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న చాలా బాధాక‌ర‌మ‌ని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. గాయ‌ప‌డ్డ‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, స్థానిక పరిపాల‌నా విభాగం.. బాధితుల‌కు సాయం చేయ‌డంలో నిమ‌గ్న‌మైన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  ఆలయంలో అగ్నిప్రమాద ఘటన విషయమై సీఎం మోహన్‌ యాదవ్‌తో మాట్లాడానని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. గాయపడినవారికి చికిత్స అందించడానికి స్థానిక అధికారులు సహాయం చేస్తున్నారని ఎక్స్‌ వేధికగా వెల్లడించారు.