దక్షిణాదిన తీవ్రంగా వ్యాపిస్తున్న రొమ్ము కాన్సర్

తూర్పు, ఈశాన్య రాష్ట్రాల కన్నా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక , ఢిల్లీ రాష్ట్రాల్లో రొమ్ముక్యాన్సర్ తీవ్రంగా వ్యాపిస్తోందని , 2025 నాటికి దేశమంతా మరింత ప్రబలుతుందని ఐసిఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా క్యాన్సర్ వ్యాప్తి ఏ విధంగా ఉందో వివరిస్తూ చేపట్టిన ఈ అధ్యయనం ఈనెల మొదట్లో ప్రచురణ అయింది. 

క్యాన్సర్ కారణంగా ఎన్ని సంవత్సరాల జీవితం కోల్పోయారో(వైఎల్‌ఎల్‌ఎస్), వైకల్యంతో బాధపడిన సంవత్సరాలు ( వైఎల్‌డీఎస్), వైకల్యం సర్దుబాటు సంవత్సరాలు ( డిఎఎల్‌వైఎస్) అనే కేటగిరీల వారీగా ఈ అధ్యయనం సాగింది. 

2016లో దేశంలో వయోప్రామాణికంగా ప్రతి లక్షమంది మహిళల్లో 515.4 మంది క్యాన్సర్ రోగులు వైకల్య సర్దుబాటు జీవితంతో గడిపినట్టు అంచనా. ఈ విధమైన క్యాన్సర్ వైకల్యసర్దుబాటు మహిళల సంఖ్య 2025 నాటికి 5.6 మిలియన్‌కు చేరుకుంటుందని అంచనా. అలాగే వీరిలో 5.3 మిలియన్ మంది మహిళలు అకాల మరణం పొందే ప్రమాదం ఉందని తేలింది.

 గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ  ప్రాంతాల్లోనే రొమ్ముక్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారని, దేశం లోని నగరాల్లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. 28 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీల ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. 

సామాజిక ఆర్థికస్థాయిలో బలహీనులైన వ్యక్తులు ఎక్కువగా ఉండడం, క్యాన్సర్‌పై పరిశోధన ప్రాధాన్యతలు లేకపోవడం, తక్కువ సామాజిక, ఆర్థిక గ్రూపులపై నిర్లక్షం ఇవన్నీ క్యాన్సర్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. దేశంలో రొమ్ముక్యాన్సర్ పరీక్షలు తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. వీరందరికీ వ్యాధిని గుర్తించే మమోగ్రఫీ వంటి పరీక్షలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది.