మ‌ణిపూర్‌లో మిలిటెంట్ల‌ దాడిలో ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతి

మ‌ణిపూర్‌లో మిలిటెంట్లు భద్రతా దళాలపై శనివారం ఉద‌యం జరిపిన దాడిలో ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. బిష్ణుపుర్ జిల్లాలో ఈ దాడి జ‌రిగింది. నార‌న్‌సైనా గ్రామం వైపున ఉన్న కొండ ప్రాంతాల నుంచి కుక్కీ మిలిటెంట్లు గ‌న్‌ఫైర్‌కు పాల్ప‌డ్డారు. 

వ్యాలీలో ఉన్న కేంద్ర బ‌ల‌గాల పోస్టును వాళ్లు టార్గెట్ చేశారు. అయితే ఔట్‌పోస్టులో బాంబు పేల‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఆ పేలుడు వ‌ల్ల‌ న‌లుగురు సిబ్బందికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంట్లో ఇద్ద‌రు చ‌నిపోగా, ఇద్ద‌రు చికిత్స పొందుతున్నారు. 

మ‌ణిపూర్ సంక్షోభానికి ఏడాది కాలం కావ‌స్తున్న త‌రుణంలో ఈ దాడి జ‌రిగిన‌ట్లు ఉన్నత పోలీసు వ‌ర్గాలు భావిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో దాక్కుకున్న మిలిటెంట్లు రానున్న రోజుల్లో దాడులు పెంచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

మృతిచెందిన ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన్లు 128 బెటాలియ‌న్‌కు చెందిన‌వాళ్లు. ఒక‌రు స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎన్ స‌ర్కార్ కాగా రెండో వ్య‌క్తి కానిస్టేబుల్ అరూప్ సైని. గాయ‌ప‌డ్డ‌వారిని జాద‌వ్ దాస్‌, అఫ్తాబ్ దాస్‌గా గుర్తించారు. ఇండియ‌న్ రిజ‌ర్వ్ బెటాలియ‌న్ క్యాంపుపై మిలిటెంట్లు పంపీ గ‌న్‌తో దాడి చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు.