లష్కరే టాప్‌ కమాండ్‌ బాసిత్‌ అహ్మద్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాసిత్ అహ్మద్ దార్ సైతం ఉన్నాడు. 2021 ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. 
 
శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లో భద్రతా దళాలు, మైనారిటీలపై దాడులతో సహా 18 కంటే ఎక్కువ కేసుల్లో అతని ప్రేమయం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అతడి తలపై రూ.10లక్షల రివార్డు సైతం ఉందని కశ్మీర్‌ ఐజీపీ వీకే బిర్ది పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. 
 
సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం పోలీసులకు అందిందని కశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. పోలీసులతో పాటు భద్రతా బలగాలు సంఘటనా స్థలాలు చుట్టుముట్టాయని.. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయని పేర్కొన్నారు.
 
 ఎన్‌కౌంటర్‌లో నిషేధిత లష్కరే తోయిబా (టిఆర్ఎఫ్) సంస్థ టాప్ కమాండర్ బాసిత్ దార్‌తోపాటు రెడ్వానీకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆపరేషన్ ముగిసిందని, సంఘటనా స్థలం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని తెలిపారు.ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రం పూంచ్‌ జిల్లాలోని సూరన్‌కోట్‌ తహసీల్‌లోని దన్నా షాసితార్‌ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌ వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వైమానిక సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిలో విక్కీ పహాడే వీరమరణం పొందారు. దాడి ఘటన అనంతరం 20 కిలోమీటర్ల పరిధిలో భద్రతా బలగాలు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి.

డ్రోన్లతోనూ ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తున్నారు. పూంచ్ దాడి తర్వాత సోమవారం ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేసింది. ఈ ఉగ్రవాదుల ఆచూకీ గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వారికి రూ.20లక్షలు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.