ప్రతి సోమవారం ఇస్త్రీ చేయని ముడతల దుస్తులే

ఆఫీసులకు వెళ్తున్నామంటే చాలు చాలామంది ఇస్ట్రీ చేసిన దుస్తులనే వేసుకుంటారు. మరికొందరు అయితే ఫార్మల్స్‌, ఇన్‌షర్ట్‌, టై, షూ ఇలా ప్రొఫెషనల్‌గా రెడీ అయి వెళ్తుంటారు. అలాంటిది ఇస్త్రీ లేకుండా ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని ఆఫీసులే చెబుతుంటే ఎలా ఉంటుంది?
 
పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు. వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు ‘స్వచ్ఛత పక్వాడ’లో భాగంగా ఈ నెల 1-15 తేదీల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
 
 ప్రతి సోమవారం తాము వేసుకొనే దుస్తులను ఇస్త్రీ చేయకుండా ఉండటం ద్వారా విద్యుత్తును పొదుపు చేస్తున్నారు. ప్రతి సోమవారం రోజు ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు వాహ్‌ మండేస్‌ ను ప్రారంభించింది. `ముడతలు మంచివే’ అనే నినాదం కూడా ఇచ్చింది.
 
పర్యావరణ హితం కోసమే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని సీఎస్‌ఐఆర్‌ మహిళా డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌. కలై సెల్వి వెల్లడించారు. సాధారణంగా ఒక జత దుస్తులను ఐరన్‌ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతుందని ఆమె చెప్పారు. దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
వారం పొడవునా కాకుండా కనీసం ఒక్క రోజు అయినా ఇలా ఇస్త్రీ లేని దుస్తులను ధరించేలా వాహ్‌ మండేస్‌ స్కీమ్‌ తీసుకొచ్చామని ఆమె చెప్పారు. ఇంధన అక్షరాస్యతలో భాగంగా విద్యుత్‌ వినియోగాన్ని 10 శాతం తగ్గించడంపై కూడా సీఎస్‌ఐఆర్‌ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సంస్థ అన్ని ప్రయోగశాలలు, పని ప్రదేశాల్లో విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా కరెంటు బిల్లును 10% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
 
 దీన్ని ఈ ఏడాది జూన్‌- ఆగస్ట్‌ మధ్యలో అమలు చేయనున్నారు. విద్యుత్తు పొదుపు కోసం తాము చేపట్టిన చొరవ ద్వారా వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచుతామని సీఎస్‌ఐఆర్‌ అధికారులు తెలిపారు. అతి చిన్న విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించేందుకు ఎలా దోహదపడతాయో ప్రజలకు వివరిస్తామని వారు చెప్పారు.