ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు

ఇక నుంచి సీబీఎస్ఈలో పదో తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు పరీక్షల నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది.  2025-26 అకడమిక్‌ సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధివిధానాలు రూపొందించాలని సీబీఎస్‌ఈని కేంద్ర విద్యా శాఖ కోరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  అయితే సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని తెలిపాయి.

ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే అంశంపై విద్యా శాఖ, సీబీఎస్‌ఈ వచ్చే నెలలో పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సంప్రదింపులు చేయనున్నట్టు పేర్కొన్నాయి.  అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల షెడ్యూల్ మీద ఎటువంటి ప్రభావం పడకుండా రెండోసారి బోర్డు పరీక్షల నిర్వహణకు అకడమిక్ క్యాలండర్ సిద్ధం చేసే పనిలో సీబీఎస్ఈ అధికారులు నిమగ్నమయ్యారని తెలుస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్ఈ పరీక్షల్లో మార్పులు తేవాలని ఇస్రో మాజీ చైర్మన్ కే కస్తూరి రంగన్ సారథ్యంలోని నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ముసాయిదా కమిటీ సూచించింది. 11,12 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్నీ ప్రతిపాదించింది.   విద్యార్థులకు సరిపడా సమయం ఉండటంతోపాటుగా పరీక్షల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ గత ఏడాది విడుదల చేసిన కొత్త నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌సీఎఫ్‌) సూచించింది.

అయితే, విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జాతీయస్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే 10వ, 12వ తరగతి విద్యార్థులు ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని, విద్యార్థులు తాము సాధించిన ఉత్తమ స్కోర్ ఎంచుకోవచ్చుని తెలిపారు.