బీజాపూర్‌లో ఇన్ఫార్మర్ల నెపంతో మావోలు ముగ్గురి హత్య!

* ఏఓబీలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం

ఛత్తీస్‌గఢ్‌లో హోలీ పండుగ రోజున ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ బాసగూడ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాసగూడ ప్రాంతంలోని ఓ కాలనీలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దాడులకు పాల్పడ్డారు. 

తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. మృతులను చంద్రయ్య మొడియం, అశోక్‌ భండారి, కారం రమేశ్‌గా గుర్తించారు. 

దాడిలో కారం రమేశ్‌కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే బూసగూడ హెల్త్‌ సెంటర్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఒకరు పోలంపల్లికి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు హీరాపూర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

సంఘటనను బీజాపూర్‌ ఏఎస్పీ జితేంద్ర యాదవ్‌ ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇది మావోయిస్టుల పనేనని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బీజాపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు శిబిరాలు ఏర్పాటు చేస్తుండడంతో నక్సల్స్‌ ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో పలుచోట్ల దాడులకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

గత రెండు రోజుల్లో దాడుల ఘటన జరుగడం ఇది రెండోది. ఆదివారం డీఆర్‌జీ జవాన్‌పై కాల్పులు జరిపింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ బస్తర్‌లో జరుగనున్నది. ఈ క్రమంలో దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. బీజాపూర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఏఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. పోలీసుల పెట్రోలింగ్‌ను సైతం పెంచినట్లు పేర్కొన్నారు.

మరోవంక, సార్వత్రిక ఎన్నికల వేళ ఏవోబీ (ఆంధ్రా ఒడిసా సరిహద్దు ప్రాంతం)లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా దళాలు గుర్తించి సీజ్‌ చేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల సమీపాన ఒడిశా రాష్ట్రంలోని సుంకి ప్రాంతం దట్టమైన అడవుల్లో ఆదివారం సాయంత్రం ఆ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. 
ఆయుధ తయారీ కేంద్రం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంతాం బడేవలస, పద్మాపురం గ్రామాలకు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఏవోబీ సరిహద్దు వద్ద సంచరిస్తున్న ఇద్దరిని వారు ప్రశ్నించగా ఆయుధ తయారీ కేంద్రం గురించి తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకున్న జవాన్లు తుపాకీ తయారీకి వినియోగించే హేండ్‌ బౌలర్‌, టిగ్గర్‌ మెకానిజం, ఫిల్లర్లు, హేమర్‌, స్లీపర్‌, చేజల్‌, ఫైల్‌, కత్తులు, ఇనుప బిట్‌, రంపం తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.