నారాభువనేశ్వరికురాష్ట్రఎన్నికలసంఘం నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ”నిజం గెలవాలి” అనే పేరుతో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
 
వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులను కలిసి భువనేశ్వరి కోడ్ ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ అంశంపై శనివారం నారా భువనేశ్వరికు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లో తమకు నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు.
 
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ”నిజం గెలవాలి” పేరుతో నారా భువనేశ్వరి పర్యటనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే మనస్తాపంతో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఆ సమయంలో నారా భువనేశ్వరి మాట ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక సాయం చేస్తూ చెక్కుల పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీనిపై అధికార పార్టీ నేతలు ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.