ఎన్నికల వ్యయ పరిమితి హద్దు దాటితే వేటు పడాలి

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల వ్యయం చేస్తే వారిపై వేటు పడేటట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యయాల పూర్వ డైరెక్టర్ జనరల్ పి.కె.డాష్ సూచించారు. విజయవాడలో  స్వేచ్ఛాయుత ఎన్నికలు – అవినీతికి అడ్డుకట్టపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలలో గెలిచిన మధుకుడ,(జార్ఖండ్), అశోక్ చౌహన్(మహారాష్ట్ర), నరోత్తం మిశ్రా (మధ్యప్రదేశ్), ఊర్మిళ జాదెబ్ లను కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితి కన్నా అధికంగా ఖర్చు చేసినట్లు రుజువు కావడంతో వారి సభ్యత్వాలను రద్దుచేసినట్లు గుర్తు చేశారు. అయితే నేడు ఎన్నికల కమిషన్ పేర్కొన్న వ్యయానికి కన్నా 100 రెట్లు ఖర్చు పెడుతున్నా ఏ ఒక్కరిని తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పౌర సంస్థలు ముందుకు వచ్చి అభ్యర్థుల వ్యయాల పై కన్ను వేసి రుజువులతో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీల వ్యయాలపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో ఎలక్షన్ బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలు పొంది ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యాoగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో నేడు కొనసాగుతున్న దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తునారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు వాలంటీర్లకు పెన్షన్, రేషన్ బియ్యం లాంటి పథకాలకు దూరంగా ఉంచాలని కోరారు.

 ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీస్ వైఫల్యం కనిపించిందని, అనంతరం జరిగిన రాజకీయ ప్రత్యర్థుల హత్యలను పోలీస్ యంత్రాంగం నివారించలేక పోయిందని,  దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని కోరారు. మండల స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా అమలు చేయాలని చెప్పారు. 

సి విజిల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేస్తే 100 నిమిషాలు లోపే చర్యలు ఉంటాయని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ వాలంటీర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ల అక్రమాల ఫలితంగా ఓటర్ల జాబితా లోప భూయిష్టంగా మారిందని పేర్కొన్నారు. 

అర్హత కలిగి ఓటు పొందని వారు ఏప్రిల్ 15 వరకు ఓటర్లుగా నమోదు అయ్యే అవకాశం ఉందని దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల పరిమితి వ్యయం రూ.  40 లక్షలకు మించకూడదని ఎన్నికల కమిషన్ పేర్కొంటే దాదాపు రూ. 40 కోట్ల ఖర్చు పెడుతున్నారని, లోక్ సభ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి 90 లక్షల ఉంటే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 

మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాధీశ్వరరావు ప్రసంగిస్తూ టీఎన్ శేషన్ ఎన్నికల చీఫ్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి సక్రమంగా అమలయిందని గుర్తు చేశారు. పూర్వ నగర మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, ఆదాయపు పన్ను పూర్వ కమిషనర్ పి.రఘు కూడా ప్రసంగించారు.