కర్బన ఉద్ఘారాల తగ్గింపుకు అణు ఇంధనమే మార్గం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30కి పైగా దేశాలు ఇంధన వనరులను ఉపయోగించి వాతావరణ-తటస్థ భూగోళాన్ని సాధించడంలో సహాయపడతాయని ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో దేశాలకు అదనపు వ్యూహాత్మక భద్రతను అందిస్తామని పేర్కొన్నాయి.  గంభీరమైన ఈ ప్రతిజ్ఞలో, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, సౌదీ అరేబియాతో సహా 34 దేశాలు అణుఇంధనంకు గట్టి మద్దతు ఇవ్వడం, అవసరమైన ఆర్ధిక వనరులను సమకూర్చడానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. 

ఇప్పటికే ఉన్న అణు రియాక్టర్లతో పాటు కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అధునాతన రియాక్టర్ల ప్రారంభ విస్తరణ వంటి చర్యల ద్వారా పూర్తి సామర్ధ్యాన్ని వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశాయి. బ్రస్సెల్స్‌ లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తొలి అణు ఇంధన సదస్సులో 30కి పైగా దేశాల నుండి ప్రతినిధులు పాల్గన్నారు. వీరిలో ప్రభుత్వాధినేతలు, నాయకులు, సీనియర్‌ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నేతలు వున్నారు. కేవలం అణు ఇంధనంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ జరిగిన మొదటి అత్యున్నత స్థాయి సమావేశం ఇదే.

“అన్ని దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న అణు దేశాలకు, వారి సామర్థ్యాలలో, వారి శక్తి మిశ్రమాలకు అణుశక్తిని జోడించే ప్రయత్నాలలో మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని ఆ ప్రకటనలో తెలిపారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంపొందించడం, ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహాన్నిందించడం వంటి అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కొనడంలో అణు ఇంధన పాత్ర ప్రముఖమైనదని వక్తలు పేర్కొన్నారు. కర్బన ఉద్ఘారాలు తగ్గించేందుకు నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలను సాధించడానికి అణు ఇంధనమే మార్గమని తెలిపారు.
 
అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతి బైరోల్‌ మాట్లాడుతూ, అణు ఇంధనం పోషించే అద్వితీయమైన పాత్రను నొక్కి చెప్పారు. అణు విద్యుత్‌ మద్దతు లేకుండా వాతావరణ లక్ష్యాలను మనం సకాలంలో సాధించలేమని స్పష్టం చేశారు. ఐఎఇఎ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ గ్రాసి మాట్లాడుతూ, పరిశుద్ధమైన ఇంధనంలో నాలుగవ వంతును అణు ఇంధనం అందిస్తోందని పేర్కొన్నారు. 
 
సురక్షితమైన, భద్రమైన, అణు వ్యాప్తి లేని రీతిలో అణు ఇంధనాన్ని ఉపయోగించేలా తమ సంస్థ సాయపడుతుందని చెప్పారు. అణు విద్యుత్‌ శాఖల నిర్వహణలో చైనా అంతర్జాతీయంగా మూడో స్థానంలో వుందని తెలిపారు. ఇంకా కొత్త యూనిట్లు అనేకం ప్రస్తుతం నిర్మాణంలో వున్నాయని చైనా అణు ఇంధన సంస్థ తెలిపింది.
జర్మనీ, స్పెయిన్ లతో సహా పలు ఐరోపా దేశాలు, చాలా మంది పర్యావరణవేత్తలు అణుఇంధనంలో పెట్టుబడులను పునరుత్పాదక ప్రయత్నాలకు ప్రమాదకరంగా భావిస్తున్న తరుణంలో ఈ సదస్సు జరగడం గమనార్హం. 2050 నాటికి ప్రపంచంలోని అణుశక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలన్న పిలుపుకు 22 మంది ప్రపంచ నాయకులు మద్దతు ఇచ్చిన గత సంవత్సరం ఐక్యరాజ్యసమితి కాప్ 28  వాతావరణ చర్చల అనంతరం ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది.
 
 “వాతావరణ మార్పుపై 28 సమావేశాలు జరిగాయి, చివరికి, అణుఇంధనంను వేగవంతం చేయాలని గుర్తించింది,” అని గ్రాస్సీ చెప్పారు. ఆలస్యంగానైనా గుర్తించారని పేర్కొంటూ, “మనం ఇంకా ఏమి చేయాలి” అనే దానిపై దృష్టి కేంద్రీకరించాలని, ముఖ్యంగా ఆర్ధిక వనరుల సమీకరణపై దృష్టి సారించాలని సూచించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాలలో 438 అణుఇంధన ప్లాంట్లు పనిచేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో అణు ఇంధనం వాటా 10 శాతం లోపే ఉంది.