ఈడీ అధికారులపైనే కేజ్రీవాల్ గూఢచర్యం?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  వ్యవహారంలో తాజాగా మరో దిగ్భ్రాంతికర అంశం వెలుగులోకి వచ్చింది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
ఆ డాక్యుమెంట్‌లో ఈడీలోని ఇద్దరు ఉన్నత అధికారుల గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం.. కేజ్రీవాల్‌కు మరిన్ని కష్టాలు తప్పవు. ఆయనపై గూఢచర్యం కేసు నమోదు కావచ్చు.  ప్రత్యేక డైరెక్టర్-ర్యాంక్ అధికారి, జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన వివరాలు అందులో ఉన్నాయని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లను బయటపెట్టలేదని తెలుస్తోంది. 
 
సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న అధికారుల్లో ఒకరి పేరు ఆ పత్రాల్లో ఉండటం చూసి అధికారులందరూ షాక్‌కు గురయ్యారు. ఆ పత్రంలో పేరున్న జాయింట్ డైరెక్టర్-ర్యాంక్ అధికారి ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తుని పర్యవేక్షిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ గురించి కేజ్రీవాల్ రిమాండ్ నోట్‌లో కూడా ప్రస్తావించబడింది. 
 
ఈ డాక్యుమెంట్ రికవరి చేసుకున్న తర్వాత  ఇద్దరు ఈడీ అధికారులపై నిఘా పెట్టినందుకు గాను కేజ్రీవాల్‌పై ప్రత్యేక కేసు నమోదు చేయాలా? వద్దా? అనేది కూడా పరిశీలిస్తోంది. తదుపరి విచారణ, చర్యల కోసం దర్యాప్తు ఏజెన్సీ అధికారులు ఈ విషయాన్ని ఏజెన్సీలోని ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ డాక్యుమెంట్‌లో ఉన్న కచ్ఛితమైన సమాచారం బహిర్గతం కాలేదు కానీ ఈడీలోని సమగ్రత, ప్రోటోకాల్‌పై ప్రశ్నలు రేకెత్తుతోంది.

ఇప్పటివరకూ ఈ కేసులో మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ‘కింగ్‌పిన్’ అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు శుక్రవారం ఈడీ వెల్లడించింది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని తెలిపింది. 

ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ఈడీ ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ చెప్పారని ఈడీ పేర్కొంది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. 

మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది. ఇక ఈ కేసులోనే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ లభించలేదని న్యాయస్థానం దృష్టికి ఈడీ పేర్కొంది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్‌తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా నటించాడని ఈడీ పేర్కొంది.

సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్‌కు లిక్కర్ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని వివరించారు. 

విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్‌కు సంబంధించిన కంపెనీ నుంచి ఆధారాలు సేకరించామని, రూ.45 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది.