మద్యం కేసులో కేజ్రీవాల్ కుట్రదారుడు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘కుట్రదారు’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కుట్ర పన్నారని ఈడీ ఆరోపణ. 
 
‘సౌత్ లాబీ’కి మేలు చేసేందుకు ఈ మద్యం పాలసీ రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిగా ఆప్ పార్టీకి సౌత్ లాబీ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపిస్తున్నది. కొందరు నిందితుల సాక్ష్యాధారాలు, ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే న్యాయస్థానాల్లో దాఖలు చేసిన చార్జిషీట్లు, రిమాండ్ నోట్లలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని ఈడీ తెలిపింది.

ఈ కేసు నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరుచుగా కేజ్రీవాల్ ఆఫీసును సందర్శించారని, అక్కడే టైం గడిపారని ఈడీ వివరించింది. కేజ్రీవాల్ తో మద్యం పాలసీ గురించి చర్చించినట్లు ఢిల్లీ మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని ఆరోపనలు ఉన్నాయి. కేజ్రీవాల్ ను ఇండో- స్పిరిట్ ఓనర్ సమీర్ మహేందుతో కలిపేందుకు విజయ్ నాయర్ ప్రయత్నించినా కుదరలేదు.

ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సీఎం కేజ్రీవాల్‌ని కలవడానికి విజయ్ నాయర్ ని పంపినట్లు తెలిసింది. సౌత్ లాబీలో నిందితుడిగా, ఇప్పుడు సాక్షిగా ఉన్న రాఘవ్ మాగుంట.. తన తండ్రి లిక్కర్ పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్‌ను కలిసినట్లు తెలిపారు.  మద్యం పాలసీపై మంత్రుల కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికను అప్పటి ఉప ముఖ్యమంత్రి  మనీశ్ సిసోడియా 2021 మార్చిలో తనకు అందజేశారని సిసోడియా మాజీ కార్యదర్శి సీ అరవింద్ వాంగ్మూలం ఇచ్చారు. 

సిసోడియాతో భేటీ తర్వాత కేజ్రీవాల్‌తో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న సత్యేంద్ర జైన్ తనకు ఒక నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రుల కమిటీలో ఎటువంటి ప్రతిపాదన చర్చించకున్నా, ఆ నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక రూపొందించాలని తనకు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అరవింద్ చెప్పారు.

ఈడీ కధనం ప్రకారం అరవింద్​ కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియా, బీఆర్​ఎస్​ నేత కే. కవిత, శరత్​ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు. 2021-22 లిక్కర్​ పాలసీ ‘డీల్​’లో భాగంగా శరత్​, మాగుంట, కవితలకు దిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లు దక్కాయి. పాలసీలో హోల్​సేలర్స్​కి 12 శాతం, రీటైర్లకు 185 శాతం ప్రాఫిట్​ మార్జిన్​ వస్తుంది. ఇది సాధారణం కన్నా చాలా చాలా ఎక్కువ!

ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్​ అయ్యారు. వారు అరవింద్​ కేజ్రీవాల్​, మనీశ్​ సిసోడియా, కవిత, ఆమ్​ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్​. ఈ 12 శాతం ప్రాఫిట్​లో 6శాతం ప్రాఫిట్స్​ని హోల్​సేలర్స్​ నుంచి ఆమ్​ ఆద్మీ పార్టీ వసూలు చేయాలని డీల్​ కుదిరిందని ఈడీ ఆరోపిస్తోంది. కుట్రకు పాల్పడింది కవితే అయినా.. ఈ లిక్కర్​ పాలసీ అనేది కేజ్రీవాల్​ సృష్టి అని ఈడీ చెబుతోంది. ఈ విషయాన్ని, ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త సమీర్​ మహేంద్రు చెప్పినట్టు ఈడీ పేర్కొంది.

“ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో కలిసి కవిత  లిక్కర్​ స్కామ్​కు పాల్పడ్డారు. నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్​శాఖ మంత్రి సిసోడియా హస్తం కూడా ఉంది. మధ్యవర్తుల ద్వారా కవిత, సౌత్​ గ్రూప్​ కలిసి  ఆమ్​ ఆద్మీకి ముడుపులు చెల్లించింది. ఫలితంగా కవితకు పాలసీ ఫార్ములేషన్​పై పట్టు దక్కింది. కవిత కోరుకున్నట్టుగా ఆమెకు ఈ పాలసీలో ప్రయోజనం చేకూరింది,” అని గత వారం బీఆర్​ఎస్​ నేతను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించిన అనంతరం ఓ ప్రకటనలో పేర్కొంది ఈడీ.