బరాజ్‌ల డిజైన్లను కోరిన కేంద్ర నిపుణులు

మేడిగడ్డ బరాజ్‌ కుంగుబాటుతోపాటు, మిగిలిన రెండు బరాజ్‌లలో సాంకేతిక సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలపై సిఫారసు చేసేందుకు కేంద్రం నియమించిన చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ ఆయన బ్యారేజీలు సంబంధించిన ఒరిజినల్ డిజైన్ లను ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లను కోరింది. 

ఎన్‌డీఎస్‌ఏ బృందం జలసౌధలో తొలుత సీడీవో అధికారులతో భేటీ అయింది. బరాజ్‌ల నిర్మాణ సమయంలో సీడీవోలో పనిచేసిన ఎస్‌ఈలు, డీఈఈలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రతి బరాజ్‌ డిశ్చార్జి కెపాసిటీ, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో పరిమాణం, మేడిగడ్డకు సంబంధించి షీట్‌ ఫైల్స్‌ను ఎందుకు వాడలేదు? అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లలో తేడాలు ఎందుకున్నాయి? తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లను తామే రూపొందించామని, మేడిగడ్డ బరాజ్‌ డిజైన్‌ను మాత్రం నిర్మాణ ఏజెన్సీనే రూపొందించిందని సీడీవో అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. బరాజ్‌లకు సంబంధించిన ఒరిజనల్‌ డిజైన్లను అందజేయాలని ఎన్‌డీఎస్‌ఏ కోరగా, వాటిని విజిలెన్స్‌ అధికారులు తీసుకెళ్లారని బదులిచ్చినట్టు తెలిసింది. 

విచారణ అనంతరం డిజైన్లకు సంబంధించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పాటించారా? నిర్వహించిన పరీక్షలు? డిజైన్ల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్న అంశాలు, టెక్నో ఎకనామిక్‌ రేషియో తదితరమైన 9 సాంకేతిక అంశాలకు సంబంధించిన ఒక ప్రశ్నావళిని సీడీవో అధికారులకు అందజేశారు. ఆయా అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలను, డిజైన్లను అదే నిర్దేశిత ఫార్మాట్‌లో అందజేయాలని ఆదేశించారు.

ఎన్‌డీఎస్‌ఏ బృందం ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మూడు బరాజ్‌లకు సంబంధించి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నది. ఓఅండ్‌ఎంకు సంబంధించిన రికార్డులను అందజేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా 2019లో మేడిగడ్డ బరాజ్‌ వద్ద గుర్తించిన సమస్యలపై ఎక్కువగా వివరాలను సేకరించినట్టు సమాచారం.

మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన డిజైన్లను సీడీవోనే రూపొందించారా? ఎవరి ప్రమేయమైనా ఉందా? సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పాటించారా? షీట్‌ ఫైల్స్‌, సీకెంట్‌ ఫైల్స్‌ను వాడాలని ఎవరు నిర్ధారించారు? ఎలాంటి లోపాలను గుర్తించారు? అంటూ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ అధికారుల(సీడీవో)ను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణులు ప్రశ్నించారు.

అంతకు ముందు, సుమారు పుష్కరకాలం పాటు  నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా కీలక స్థానంలో ఉంటూ కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజిలకు పునాదుల నుంచి పనులు పూర్తయ్యేదాక బాధ్యతలు నిర్వహించి ఇటీవలే ఈఎన్సీ స్థానానికి రాజీనామ చేసి ఉద్యోగ విరమణ చేసిన మురళీధర్‌ను కూడా కమిటీ సమావేశానికి పిలిపించింది.

ఈ భేటీలో మురళీధర్ నుంచి ప్రాజెక్టు డిజైన్లు, ప్లానింగ్, ఆనకట్టల నిర్మాణం , పనులు నాణ్యత, క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇచ్చిన నివేదికలు తదితర అంశాలపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగిన లోపాలు , మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు గుర్తించిన కారణాలు ,తదితర అంశాలపై కూడా ప్రశ్నించింది