హైదరాబాద్ లో భారీగా తగ్గిన వాయుకాలుష్యం

హైదరాబాద్ నగరంలో వాయికాలుష్యం భారీగా తగ్గిందని ఓ అంతర్జాతీయ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం వివిధ నగరాల్లో వాయు కాలుష్యంపై స్విట్జర్లాండ్‌ కేంద్రంగా ఉన్న ఐక్యూ ఎయిర్‌ సంస్థ ఇటీవలే ఓ అధ్యయనం నిర్వహించింది.  దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌, పటాన్‌చెరు, నల్లగొండ, సంగారెడ్డి పట్టణాలలో వాయు నాణ్యత మెరుగుపడిందని వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2023 వెల్లడించింది. 
 
వరుసగా ఐదు సంవత్సరాలలో నమోదైన వాయు నాణ్యత ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2019 నుంచి 2023 మధ్య హైదరాబాద్‌లో గాలి నాణ్యత మెరుగుపడినట్టు ఆ నివేదిక పేర్కొంది. గాలిలోని దుమ్ము, ధూళి కణాల (పీఎం10 -మైక్రాన్‌లు) సాంద్రత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడినట్టు తెలిపింది.
 
ఈ నివేదిక ప్రకారం భారత్‌ వాయుకాలుష్య దేశాల్లో 3వ స్థానంలో ఉంది.  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలతో గడిచిన ఐదేండ్లలో హైదరాబాద్‌, పటాన్‌చెరు, నల్లగొండ, సంగారెడ్డిలో గాలి నాణ్యత మెరుగుపడినట్టు ఆ నివేదిక తెలిపింది. కాలుష్య నియంత్రణకు బ్లాక్‌-టాపింగ్‌, పాట్‌హోల్స్‌ లేని రోడ్ల నిర్వహణ, గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి, చెత్త రీసైక్లింగ్‌, అనధికార డంపింగ్‌ పర్యవేక్షణ, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాల విధింపు వంటి చర్యలు చేపట్టింది. 
 
ఐక్యూ ఎయిర్ సంస్థ చేసిన అద్యయనం ప్రకారం హైదరాబాద్‌లో వాయు కాలుష్యం 2019-20లో పీఎం-10.. 101ఉండగా.. 2022- 23లో 87గా నమోదైంది. అయితే.. 2023-24 సంవత్సరంలో 83గా నమోదైందని సంస్థ వెల్లడించింది. నగరంతో పాటు సంగారెడ్డి, పటాన్‌చెరులోనూ గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం వాయు కాలుష్యం తగ్గిందని వెల్లడించింది. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వాయు కాలుష్యంలో రహదారి దుమ్ము 32 శాతం, వాహనాల కాలుష్యం 18 శాతం ఉందని నివేదికలో పేర్కొంది. 
 
అయితే నగరంలో ఈ భారీ మార్పునకు కారణాలేంటంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో టీఎస్ ఆర్టీసీ డీజిల్‌ బస్సుల స్థానంలో వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులు వినియోగించటం, ప్రధాన రహదారులు దాటేందుకు పాదచారులు ఉపయోగించేందుకు ట్రాఫిక్‌ పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుచేయడం, ట్రాఫిక్‌ రద్దీని బట్టి ఆటోమెటిక్‌గా మారే అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం (ఏటీసీఎస్) ఏర్పాటే ప్రధాన కారణాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వివరించింది.