విశాఖలో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టివేత

* సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’

ఎప్పుడూ గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కొకైన్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన ఓ కంటెయినర్‌లో సుమారు 25వేల కిలోల డ్రై ఈస్ట్‌లో కొకైన్‌ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌ను ఛేదించారు. 
 
సుమారు 25 వేల కిలోల ‘డ్రై ఈస్ట్‌’తో కలిపి ఉన్న కొకైన్‌ను స్వాధీనం చేసుక్నుట్టు వెల్లడించారు. అయితే ఎంతమొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి షిప్‌ కంటైనర్‌లో భారీ పరిమాణంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు పసిగట్టిన ఇంటర్‌పోల్‌ ఢిల్లీలోని సీబీఐ అధికారులను అప్రమత్తం చేసింది. 
 
అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సీబీఐ అధికారులు కస్టమ్స్‌ అధికారుల సహాయంతో మాదక ద్రవ్యాలతో ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోని సరకును పరిశీలించేందుకు ఈ నెల 19న ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు. సుమారు 25 వేల కిలోల (ఒక్కొక్కటి 25 కిలోలున్న వెయ్యి బ్యాగులు) ఇన్‌యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌తో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను కలిపినట్టు నిర్ధారించారు. 
 
డ్రగ్స్‌తో వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ పేరిట బుక్‌ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్‌ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

కస్టమ్స్, డీఆర్ఐ తో కలిసి సీబీఐ ఈ ఆపరేషన్ ను చేపట్టింది. కంటైనర్‌లో ఒక్కొక్కటి 25 కిలోల బరువున్న 1,000 బస్తాల ‘డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసిన డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.  నార్కోటిక్స్ డిటెక్షన్ మెకానిజమ్‌లను ఉపయోగించి దొరికిన సరుకు డ్రగ్స్ అని ప్రాథమిక పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకున్నామని, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇక ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకటం సంచలనంగా మారింది. ఇప్పటికే విశాఖ ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పెద్ద ఎత్తున వీటిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకటం చర్చనీయాంశంగా మారింది.