మోదీ పల్నాడు సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక కోరిన ఈసీ

ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన తొలి బహిరంగసభలో ఏపీ పోలీసుల భద్రతా వైఫల్యంపై ఎన్నికల కమిషన్ నివేదిక కోరింది. ప్రధాని భద్రతా అంశం తమ పరిధిలో లేదని, దీనిపై దర్యాప్తు జరిపామని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు నివేదించామని చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకుంద్ కుమార్ మీనాను ఈ విషయమై దర్యాప్తు జరిపి, నివేదిక పంపమని కమిషన్ ఆదేశించింది.
 
ఈ సభలో పలు భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయి. దీంతో సభ మధ్యలో ప్రధాని మోదీ  స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికే ఎన్డీయే నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పందించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ నెల 17న బొప్పూడిలో నిర్వహించిన ఎన్డీయే సభకు భారీ ఎత్తున మూడు పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయడంలో పల్నాడు ఎస్పీ సహా ఇతర పోలీసులు కూడా విఫలమయ్యారని ఎన్డీయే నేతలు సీఈవోకు ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కానీ, మోదీ  పాల్గొన్న సభలో జనాన్ని నియంత్రించడంలో కానీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు.
 
ఇందుకు బాధ్యులైన పల్నాడు ఎస్పీతో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దానితో, ప్రధాని మోదీ  పాల్గొన్న పల్నాడు సభలో భద్రతా లోపాలపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని  ఆదేశాలు పంపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఓ లేఖ అందింది. 
 
దీంతో ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పందిస్తుందని చెప్తూ వస్తున్న సీఈవో ముకేష్ కుమార్ మీనా విచారణ ప్రారంభించబోతున్నారు. రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై సీఈసీకి నివేదిక పంపబోతున్నారు. ఈ నివేదిక అందాక ఈసీ తదుపరి చర్యలు చేపట్టనుంది.