కాకినాడ జనసేన లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్

జనసేన తరఫున పోటీ చేసే ఇద్దరు ఎంపీ అభ్యర్థుల్లో ఒక అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తారని ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్‌ కళ్యాణ్ సమావేశం అయ్యారు. 
 
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌ను ప్రకటించారు. ‘టీ టైం ఉదయ్’గా ఆయనకు గుర్తింపు ఉంది. ఉదయ్‌ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.  తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎంపీగానూ పోటీ చేసే అవకాశాల పైనా స్పందించారు.
 
‘నన్ను ఎంపీగా పోటీ చేయమని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా చెబితే, ఆలోచిస్తా. అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్‌, కాకినాడ నుంచి ఎంపీగా నేను పోటీ చేస్తాం’ అని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. దుబాయ్‌లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు తిరిగొచ్చిన ఉదయ్.. రాజమండ్రిలో రూ. 5 లక్షల పెట్టుబడితో ‘టీ టైమ్’ ప్రారంభించారు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించారు. 
 
అనతి కాలంలోనే 100 టీ టైమ్ ఔట్‌లెట్లను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం వందలాది బ్రాంచీలు ఉన్నాయి.  ‘టీ టైమ్’ను నెలకు రూ. 25 కోట్ల టర్నోవర్ ఇచ్చే వ్యాపార సంస్థగా మార్చి వ్యాపారవర్గాలను అబ్బురపరిచారు ఉదయ్. సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం సమకూరుతోంది. 
 
ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 3000లకు పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. 3000 మందికి ఉపాధి సమకూరుతోంది. టీ టైమ్ సంస్థకు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. 45 మంది ఉద్యోగులు వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.