లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌నున్న‌ బీజేపీ, అకాలీద‌ళ్‌

* తమిళనాడులో పీఎంకేతో పొత్తు
 
రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పంజాబ్‌లో బీజేపీ, శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ) చేతులు క‌ల‌ప‌నున్నాయి. ఈ పార్టీల‌ మ‌ధ్య మ‌ళ్లీ పొత్తు చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. పంజాబ్‌లోని 13 లోక్‌స‌భ స్ధానాల‌కు జూన్ 1న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పంజాబ్‌లో బీజేపీ, ఎస్ఏడీ మ‌ధ్య పొత్తుపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని బీజేపీ సీనియ‌ర్ నేత‌, పార్టీ ప్ర‌తినిధి ఎస్ఎస్ చ‌న్నీ తెలిపారు. 
 
మార్చి 22న అకాలీద‌ళ్ కోర్ క‌మిటీ భేటీ జ‌ర‌గ‌నుంది. పొత్తుపై అకాలీద‌ళ్ నిర్ణ‌యం అనంత‌రం బీజేపీ, ఎస్ఏడీ మ‌ధ్య లాంఛ‌న‌ప్రాయంగా చ‌ర్చ‌లు సాగుతాయ‌ని, ఆపై పొత్తు ఖ‌రారు అవుతుంద‌ని చ‌న్నీ చెప్పారు. పొత్తుపై తుది నిర్ణ‌యం బీజేపీ అధిష్టానం తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు.  ఇక త‌మ పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశంలో ఎన్నిక‌ల పొత్తులు స‌హా అన్ని అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని అకాలీద‌ళ్ సీనియ‌ర్ నేత‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ద‌ల్జిత్ సింగ్ చీమా తెలిపారు. భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీతో ఎన్నిక‌ల పొత్తు ఉండే అవ‌కాశం ఉంద‌ని బీజేపీతో పొత్తుపై చీమా సానుకూల సంకేతాలు పంపారు.

మరోవంక, దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు జాతీయ పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తమిళనాడులో సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్ ప్రాంతీయ పార్టీ పట్టాలి మక్కల్ కట్చి  (పీఎంకే)తో పొత్తు పెట్టుకుంది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు. 

లోక్ సభ సీట్ల గురించి ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నామలై ప్రకటించారు. ప్రధాని మోదీ మాదిరిగా సమాజానికి మంచి చేయాలనే తపన రాందాస్‌కు ఉందని ప్రశంసించారు. దక్షిణ తమిళనాడులో వన్నియార్ కులం ప్రభావం ఉంటుంది. పీఎంకేకు ఆ సామాజికవర్గం ఓటు బ్యాంక్ ఉంది. ఎన్డీఏ కూటమిలో పీఎంకే గత పదేళ్ల నుంచి భాగస్వామిగా ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కూడా పాల్గొన్నారు.

ఇలా ఉండగా, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ థాకరే  బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్డే సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను దేశ రాజధాని ఢిల్లీలో కలవడంతో ఆయన కూడా ఎన్డీయేలో చేరుతున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి తరఫునే ఎంఎన్‌ఎస్ అభ్యర్థులు పోటీ పడబోతున్నారనే ప్రచారం జరుగుతన్నది. కాగా, ఎంఎన్‌ఎస్‌ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు.