దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. నగరవాసులు పేపర్ ప్లేట్‌లు వినియోగం, రెండు రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సోమవారం అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బెంగళూరులో రోజుకు 2,600 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా, దాదాపు 500 ఎంఎల్‌డీ (50 కోట్ల లీటర్లు) కొరత ఉందని తెలిపారు.
తాగునీటి సరఫరాకు నిధుల కొరతలేదని, భవిష్యత్తులో ఈ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నగరంలో ఉన్న మొత్తం 14 వేల బోరుబావుల్లో 6,900 మేర ఎండిపోయాయని పేర్కొన్నారు. జూన్‌లో ప్రారంభం కానున్న ‘కావేరీ ఫైవ్ ప్రాజెక్టు’ ద్వారా చాలా వరకు నీటి ఇబ్బందులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘
‘బెంగళూరు నగరంలో మొత్తం 14 వేల బోర్లు ఉండగా.. వాటిలో 6,900 ఎండిపోయాయి.. కొన్ని చెరువులు వంటి కొన్ని జలవనరులు ఆక్రమణకు గురయ్యాయి.. మహానగరానికి రోజుకు 2600 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం.. కావేరి నుంచి 1470 ఎంఎల్‌డీ, 650 ఎంఎల్‌డీ బోరుబావుల నుంచి తీసుకుంటున్నాం.. వచ్చే జూన్‌లో ప్రారంభం కానున్న ‘కావేరీ ఫైవ్ ప్రాజెక్టు’ ద్వారా చాలావరకు కష్టాలు తీరతాయి’ అని తెలిపారు.
`జూన్ వరకూ తాగునీటి అవసరాలకు కావేరి, కాబిని జలాలు సరిపోతాయి.. ప్రస్తుతం కృష్ణరాజ సాగర (కావేరి)లో 11.04 టీఎంసీలు, కాంబినిలో 9.02 టీఎంసీలు ఉన్నాయి.. 313 చోట్ల కొత్తగా బోరు బావులు వేయించి, మరో 1,200 పునరుద్ధరిస్తాం.’ అని సీఎం సిద్ధరామయ్య వివరించారు.
నగరంలో నీటి సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ట్యాంకర్లు సహా అన్ని ప్రైవేట్ ట్యాంకర్లను వినియోగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పార్కులకు తాగునీటిని వినియోగించకుండా చర్యలు కట్టుదిట్టం చేయాలని, అందుకు నిఘా బృందాలను పెంచాలని సిద్ధూ సూచించారు. బెంగళూరులో కలిసిన 55 గ్రామాల్లో సమస్య ఉందని చెబుతూ జూన్ చివరికి కావేరి ఐదో దశ పనులు పూర్తయి 775 ఎంఎల్‌డీల నీరు లభిస్తుందని ఆయన తెలిపారు.
దాదాపు 40 ఏళ్లలో ఎన్నడూ చూడని నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంటోంది. వైట్‌ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఆర్‌ఆర్ నగర్, కేంగేరీ, సీవీ రామన్ ప్రాంతాల్లో సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఓ వైపు ఆంక్షలు విధిస్తోన్న అధికారులు.. పొదుపు మార్గం అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, కావేరీ ఫైవ్ ప్రాజెక్ట్ 110 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీర్చుతుంది. 2006-07లో బెంగళూరు నగరాన్ని కూడా ఇందులో చేర్చారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన