రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మరోసారి దత్తాత్రేయ హోసబలేను సర్ కార్యవాహగా ఎన్నుకున్నది. ఆయన 2027 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. 2021 నుంచి హోసబలే సర్ కార్యవాహ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాగపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన అఖిల భారత ప్రతినిధుల సభలో మరోసారి దత్తాత్రేయను మరో మూడేళ్లకు సర్ కార్యవాహగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2021కి ముందు భయ్యాజీ జోషి సర్ కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ సందర్భంగా హోసబలే 2024- 2027కు ప్రకటించిన నూతన కార్యవర్గంలో ఆరుగురు సహా సర్ కార్యవహ్ లను నియమించారు. వారు కృష్ణ గోపాల్, ముకుంద్, అరుణ్ కుమార్, రామ్ దుత్త చక్రధర్, అతుల్ లిమయే, అలోక్ కుమార్. సామజిక సమరసత అన్నది తమకు ఒక వ్యూహం కాదని, ధృడ విశ్వాసం అని ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు. సామజిక మార్పును సమాజంలోని మంచివారంతా కలిసి ఉమ్మడిగా పనిచేస్తేనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. మొత్తం సమాజంతో చేరి సామజిక మార్పు వైపు పురోగమించేందుకు ఆర్ఎస్ఎస్ దీక్షబూనిన్నట్లు ఆయన వివరించారు.
మైనారిటీ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించడంపై హోసబలే ప్రస్తావిస్తూ రాజకీయాల్లో మైనారిటీ ధోరణిని సంఘ్ వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రెండవ సర్ సంఘచాలక్ నుండి, సర్ సంఘచాలక్‌లందరూ ముస్లింలు, క్రైస్తవులతో సమన్వయం కోసం పనిచేశారని చెప్పారు. మణిపూర్‌లో ఇటీవలి అల్లర్ల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వీటిలో ప్రమేయం ఉన్న రెండు సామజిక వర్గాలు మెయిటీస్, కుకీలలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని చెప్పారు. ఇరు వర్గాల నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించామని, ఈ ప్రయత్నాలు సఫలమయ్యాయని తెలిపారు.
ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పెద్ద పండుగ
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెద్ద పండుగ అని పేర్కొంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఐక్యతను బలోపేతం చేయడం, ప్రగతి వేగాన్ని కొనసాగించడం చాలా అవసరం అని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన స్వయంసేవకులు వంద శాతం పోలింగ్‌పై అవగాహన కల్పిస్తారని చెప్పారు. శత్రుత్వం, వేర్పాటువాదం లేదా విభజన ప్రయత్నాలు లేదా ఐక్యతకు విరుద్ధమైన అంశాలు ఉండకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఆర్‌ఎస్‌ఎస్ పని ప్రభావం నేడు సమాజంలో కనిపిస్తోందని చెబుతూ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత వంటి కీలక అంశాలు ఏ ఒక్క సంస్థకు మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి సంబంధించినవని ఆయన సూచించారు. సమాజంలో ఇప్పటికీ కొన్ని సామాజిక వివక్ష, అంటరానితనం సంఘటనలు గమనించవచ్చని విచారం వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో వీటి ప్రభావం చాలా తక్కువ అయినప్పటికీ సమాజంలో సరస్సులు, బావులు, దేవాలయాలు, శ్మశాన వాటికలకు సంబంధించి ఎలాంటి వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, సందేశ్‌ఖాలీ ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళల ప్రతినిధులు భారత రాష్ట్రపతిని కలిశారని హోసబాలే తెలిపారు. సంఘ్ స్వయంసేవకులు మరియు సంఘ్ ప్రేరేపిత సంస్థలు వారికి మద్దతు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రతినిధుల సభలో దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నిర్వహించిన `అక్షింతల పంపిణీ’ని ప్రజలు స్వాగతించిన తీరును దేశ వాతావరణాన్ని చూపుతుందని పేర్కొన్నారు. రామ మందిరం భారతదేశ నాగరికతకు, సంస్కృతికి చిహ్నమని చెప్పారు. శ్రీరాముడు దేశం నాగరికత గుర్తింపని పలుసార్లు రుజువైందని, తాజాగా జనవరి 22 న మరోసారి నిరూపితమైందని దత్తాత్రేయ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, ఇతర సంస్థల కార్యకర్తలు దాదాపు 20కోట్ల గృహాలను కేవలం 15రోజుల్లోనే సంప్రదించారని చెబుతూ ఇది దేశ చరిత్రలోనే రికార్డని చెప్పారు.
దత్తాత్రేయ హోసబాలే కర్ణాటకలోని షిమోగాకు చెందినవారు. డిసెంబర్ 1, 1955న జన్మించిన హోసబలే 13 సంవత్సరాల వయస్సులో 1968లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1972లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. హోసబాలే బెంగుళూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
దత్తాత్రేయ హోసబలే ఏబీవీపీలో వివిధ హోదాల్లో పని చేసి చివరలో అఖిల భారత సంఘటనా కార్యదర్శిగా పనిచేశారు. 2002-03లో ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ గా నియామకమయ్యారు. 2009 నుంచి సహా కార్యవాహగా సేవలందించారు. ఆయనకు మాతృభాష కన్నడతో పాటు, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతంతో సహా అనేక భాషలలో పరిజ్ఞానం ఉన్నది. ఎమర్జెన్సీ సమయంలో 14 నెలల పాటు మిసా ఖైదీగా జైలులో గడిపిన దత్తాత్రేయ హోసబాలే 1975-77లో జేపీ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు