మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ విజేత

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌ ఫైట్‌లో నిలిచిన తొలిసారే టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది.  మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
ఢిల్లీ లోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 18.3 ఓవర్లలో 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ తర్వాత లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేసిన బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్పిన్‌తో తిప్పేసింది. ఆర్సీబీ స్పిన్‌ త్రయం శ్రేయాంక పాటిల్‌ (4/12), సోఫీ మొలినెక్స్‌ (3/20), ఆశా శోభన (2/14)లు కట్టడిచేయడంతో ఢిల్లీ మొదట 113 పరుగులకే ఆలౌట్‌ అయింది.
షఫాలీ వర్మ (27 బంతుల్లో 44, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా మెగ్‌ లానింగ్‌ (23), రాధా యాదవ్‌ (12), అరుంధతి రెడ్డిలు (10)లు మినహా మిగిలినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.  స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఏమాత్రం హర్రీబెర్రీ లేకుండా ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31, 3 ఫోర్లు), సోఫీ డెవిన్‌ (27 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్సర్‌) లు 8 ఓవర్లలో 49 పరుగులు జోడించారు.
శిఖా పాండే డెవిన్‌ను ఔట్‌ చేసి ఢిల్లీకి తొలి బ్రేక్‌ ఇచ్చింది. కానీ ఎల్లీస్‌ పెర్రీ (35 బంతుల్లో 37 నాటౌట్‌, 4 ఫోర్లు), మంధానలు రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించారు.  ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఆ జట్టును విజయం వైపు నడిపించారు. ఆర్సీబీ విజయానికి మరో 32 పరుగులు అవసరమనగా మంధాన ఔట్‌ అయినా పెర్రీ ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది.
ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రిచా ఘోష్‌ (14 బంతుల్లో 17 నాటౌట్‌, 2 ఫోర్లు) గెలుపు పరుగులు చేసింది. ఢిల్లీతో ఫైనల్లో ఆర్‌సీబీ స్పిన్నర్లు తీసిన వికెట్లు. డబ్ల్యూపీఎల్‌లో ఒక జట్టులో స్పిన్నర్లు పడగొట్టిన అత్యధిక వికెట్లుగా రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్‌లో ఆరంభ సీజన్‌ (2008) నుంచి ఆడుతున్నా ఆర్సీబీ ఇంతవరకూ ట్రోఫీని నెగ్గలేదు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్‌ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయింది.
దిగ్గజ క్రికెటర్లు ఆడిన ఆర్సీబీకి పురుషుల ఇంతవరకూ కప్‌ నెగ్గకపోయినా అమ్మాయిలు మాత్రం రెండో ప్రయత్నంలోనే ఆ కల తీర్చారు. ఢిల్లీ కూడా పురుషుల ఐపీఎల్‌ టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ఫ్రాంచైజీనే.. ఈ జట్టు సైతం 2008 నుంచే ఐపీఎల్‌ (ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌) లో ఉన్నా మధ్యలో పేర్లు మార్చుకున్నా ఆ జట్టు కూడా ట్రోఫీ నెగ్గలేదు.

డబ్ల్యూపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్‌ చేరినా తుదిపోరులో ఢిల్లీ రెండుసార్లూ రన్నరప్‌గానే నిలిచింది. మహిళల ప్రీమియర్ లీగ్ గతేడాది ప్రారంభం కాగా.. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆర్సీబీ నిష్క్రమించింది. కానీ, ఈసారి మాత్రం టైటిల్ గెలవాలనే కలను నెరవేర్చుకుంది.