ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలి

ఏపీలో అవినీతి జగన్ సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఏపీలో మంత్రులు పరిపాలనను గాలికి వదిలివేసి అవినీతి, అక్రమాలలో పోటీ పడుతున్నారని చెబుతూ  ఒకరిని మించి ఒకరు అవినీతి చేస్తున్నారని ధ్వజమెత్తారు.  తెలుగు దేశం పార్టీ, జనసేనలతో కలిసి చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామం వద్ద జరిపిన భారీ బహిరంగసభ “ప్రజాగళం”లో ఆదివారం మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పర్చాడాలని కోరారు.  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో పదేళ్ల తర్వాత మొదటిసారిగా రాజకీయ వేదికను పంచుకున్నారు.
 
 శనివారం ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ  ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ప్రధాని మోదీ ఆరోపించారు. వైసీపీ, కాంగ్రెస్‌ను ఒకే కుటుంబం నడుపుతోందని చెబుతూ ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందని హెచ్చరించారు.
 
ఎన్డీఏ కూటమి రోజురోజుకూ బలం పుంజుకుంటుందని చెబుతూ టిడిపి, జనసేన ఎన్డీయేలో చేరాయని గుర్తు చేశారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని మోదీ కితాబు ఇచ్చారు. చంద్రబాబు చేరికతో ఎన్డీఏ మరింత బలపడిందని చెబుతూ ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.  ఎన్నో జాతీయ విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని చెబుతూ తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామని వివరించారు.
 
రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఓడరేవును చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఎన్డీఏలో అందరినీ కలుపుకొని వెళ్తామని పేర్కొంటూ ఎన్నికలకు ముందే ఇండియా కూటమి పార్టీలు గొడవ పడి విడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 
 
ఎన్టీఆర్‌ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారని, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని గుర్తు చేశారు.  పేదల కోసం ఆలోచించేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.  ఎన్డీఏ విధానాలతో పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. 
 
ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇళ్లు ఇస్తున్నామని, జల్ జీవన్ మిషన్ ద్వారా కోటి కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏపీలో 1.25 కోటి మందికి వైద్య సదుపాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద సాయం అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
 
ఏపీలో గెలవబోయేది ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయుడు భరోసా వ్యక్తం చేశారు. కూటమికి ప్రధాని మోదీ అండ ఉందని చెబుతూమోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే అని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
సంక్షేమం, అభివృద్ధి తమ అజెండా అని చెబుతూ మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి, మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం అని కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ దూసుకుపోతోందని చంద్రబాబు తెలిపారు. పేదరికం లేని దేశం అనేది మోదీ కల అన్న చంద్రబాబు మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని పిలుపిచ్చారు.
 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇసుక పేరుతో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందం అంటూ అమరావతి అండగా ప్రధాని మోదీ అని చెప్పారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని విమర్శించారు. ఏపీ రావాల్సిన పరిశ్రమలను వైసీపీ నేతలు తరిమేశారని ఆరోపించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.