పాక్ వద్ద అణుబాంబు… గౌరవించాల్సిందే… ఓ కాంగ్రెస్ నేత!

తామేదో మేధావులం అనుకొంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇస్తున్న ప్రకటనలు ఆ పార్టీని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. మొన్నటి వరకు సామ్ పిట్రోడా ప్రకటనలకు సమాధానాలు ఇచ్చుకోలేక, చివరకు ఆయనను పార్టీ పదవి నుండి తప్పుకోనేతలంటూ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో మాజీ కేంద్ర మంత్రి ప్రకటనలపై నోరు మెదపలేని పరిస్థితి ఎదుర్కొంటున్నది.
 
పాకిస్థాన్ పట్ల తరచూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తూ కాంగ్రెస్ నేతలు కలకలం రేపుతున్నారు. వారిలో ముఖ్యంగా, మాజీ కేంద్ర మంత్రి, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత మ‌ణి శంక‌ర్ అయ్య‌ర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న ఇటీవ‌ల హెచ్చరించారు. 
 
రాజాగా, పాకిస్థాన్ వ‌ద్ద అణు బాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని స‌తాయిస్తే, అప్పుడు ఆ దేశం మ‌నపై బాంబులు వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న మరోసారి హెచ్చరించారు. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఇంట‌ర్వ్యూ ఈ విషయమై వైర‌ల్ అయ్యింది. పాకిస్థాన్‌ను మ‌నం గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద బాంబు ఉంద‌ని, వాళ్ల‌కు మ‌న మ‌ర్యాద ఇవ్వ‌కుంటే, వాళ్లు మ‌న‌పై అణుబాంబును వాడే అవ‌కాశం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డించారు.

పాకిస్థాన్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, కానీ మ‌న‌వాళ్లు మిలిట‌రీని వాడుతున్నార‌ని, దీని వ‌ల్ల ఉద్రిక్త‌తలు పెరుగుతున్నాయ‌ని, వాళ్ల ద‌గ్గ‌ర బాంబులు ఉన్నాయ‌ని, ఓ పిచ్చోడు బాంబులు వేయాల‌నుకుంటే ఏమ‌వుతుందో తెలుసా? అని ఆయ‌న తెలిపారు. బాంబు మ‌న ద‌గ్గ‌రా ఉన్నాయ‌ని, ఒక‌వేళ లాహోర్‌పై బాంబు ప‌డితే, దాని రేడియేష‌న్ 8 సెక‌న్ల‌లో అమృత్‌స‌ర్ చేరుతుంద‌ని పేర్కొన్నారు.

మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ త‌ప్పుప‌ట్టింది. ఇది కాంగ్రెస్ ఐడియాల‌జీని ప్ర‌తిబింబిస్తుంద‌ని బీజేపీ ఆరోపించింది. అయ్య‌ర్ వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ త‌న ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. పాకిస్థాన్‌కు మద్దతు పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాల‌జీ అని ఆయ‌న విమ‌ర్శించారు. 

సియాచిన్‌ను వ‌దిలేసుకునేందుకు ఆ పార్టీ సిద్ద‌మైంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల్ని విభ‌జించి, అబద్దాలు చెప్పి, ఫేక్ గ్యారెంటీలు ఇస్తున్నార‌ని, పేద‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల్ని త‌రిమికొడుతామ‌ని ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీతో పాటు ఇత‌ర నేత‌లు అన‌డంతో మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలపై అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్‌తో కాంగ్రెస్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ వారిని గౌరవించడం గురించి ఆయ‌న మాట్లాడుతుని ధ్వజమెత్తారు.  భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, మద్దతిచ్చే దేశంగా పేరొందిన పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ కొనసాగుతున్న అనుబంధాన్ని అయ్యర్ వ్యాఖ్యలు ఉదహరిస్తున్నాయని ఆయన తెలిపారు.

“కాంగ్రెస్‌కు పాకిస్తాన్ నుండి మద్దతు వచ్చినప్పుడు, వారి నాయకులు కసబ్, పాకిస్తాన్‌లకు 26/11కి క్లీన్ చిట్ ఇచ్చారు. శశి థరూర్ కాశ్మీర్ కోసం పాకిస్తాన్ భాషతో సమానమైన పదాలను ఉపయోగించారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు పుల్వామా, పూంచ్ ఉగ్రవాద దాడులకు సంబంధించి ప్రకటనలు చేశారు” అని గుర్తు చేశారు.

`ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ ఉగ్రవాదులతో నిలబడి పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ, ఉగ్రవాదులు, పాకిస్తాన్‌తో కాంగ్రెస్ చేయి చూపారు. ఇప్పుడు దీనికి మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది’ అంటూ ధ్వజమెత్తారు. అయ్యర్‌పై నిందలు వేస్తూ, బిజెపి నాయకుడు మేజర్ సురేంద్ర పూనియా ఎక్స్ లో పోస్ట్ చేసారు. “మణిశంకర్ అయ్యర్ ఐఎస్ఐ తరపున బ్యాటింగ్ చేస్తున్నారు.  భారతదేశం పాకిస్తాన్ ఒడిలో కూర్చోవాలని కోరుకుంటున్నారు! కాంగ్రెస్‌ వారికి పాకిస్తాన్‌పై ఎందుకు అంత ప్రేమ ఉంది? అది వారి వ్యవస్థలో ఉంది.” అంటూ మండిపడ్డారు.