తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్‌ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా నియమితురాలైన తమిళ సై ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించే లక్ష్యంతో పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. గత కొద్ది రోజులుగా ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడు తున్నాయి. 
 
తమిళనాడులోని చెన్నై సెంట్రల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తమిళ సై పోటీకి బీజేపీ అధినాయకత్వం అమోదం తెలపడంతో రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. గవర్నర్ గా తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో ఆమెకు పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గవర్నర్‌ను ప్రభుత్వం గౌరవించడం లేదని పలుమార్లు ఆమె ఆరోపించారు. 
 
ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్‌లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తమిళనాడుకు చెందిన తమిళ సై వృత్తిరీత్యా వైద్యురాలిగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా నియమించారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా భాద్యతలు చేపట్టారు. 
 
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌కు పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 18 ఫిబ్రవరి 2021న భాద్యతలు చేపట్టారు. తమిళ సై ఎంబీబీఎస్ విద్యను చెన్నైలోని మద్రాస్ మెడికల్ విశ్వవిద్యాలయంలో, పీజీలో ప్రసూతి, గైనకాలజీ విద్యను డాక్టర్ ఎంజిఆర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. సోనాలజీ, ఎఫ్.ఈ.టీ థెరపీలో ఉన్నత విద్యను కెనడాలో పూర్తి చేశారు.
తమిళ సైకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఎంబీబీఎస్ విద్యను మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేశారు. బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు.

1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007 లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర భారతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, 2013 లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014వ సంవత్సరం నుంచి తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు.

2006, 2011 లో రెండుసార్లు శాసనసభ సభ్యురాలిగా పోటీ చేశారు. 2009, 2019 లో రెండు సార్లు లోక్ సభ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. 2024లో చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నియోజక వర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. తమిళసై భర్త సౌందరరాజన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే అకాంక్షతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.