తెలంగాణ డబ్బు ఢిల్లీ పెద్దలకు చేరుతోందని అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమవారం ఉదయం జగిత్యాలలో నిర్వహించిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ లపై విమర్శలు సంధించారు. దేశంలో జరిగిన స్కామ్‌లన్నింటికి కుటుంబ పార్టీలే కారణమని స్పష్టం చేశారు.
వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని చెప్పారు. తెలంగాణలో బిజెపి క్రమంగా బలపడుతోందని చెబుతూ తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ .. 400 పార్ అంటున్నారని ప్రధాని తెలిపారు. ఇండియా కూటమి తన మ్యానిఫెస్టోలో శక్తి గురించి ప్రస్తావన చేసిందని, కానీ తనకు ప్రతి తల్లి, కూతురు, సోదరి శక్తి రూపమే అని చెబుతూ వారందర్నీ శక్తిగా ఆరాధిస్తానని తెలిపారు.
భారత మాతను ఆరాధిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో శక్తిని నాశనం కోరుకున్నదని, ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, శక్తిని కాపాడుకునేందుకు తన ప్రాణాలను అడ్డువేస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శక్తిని ఆరాధించేవారికి, శక్తిని నాశనం చేయాలనుకునే వారి మధ్య పోరాటం సాగుతుందని చెబుతూ జూన్ 4వ తేదీన ఆ పోరాటం ముగుస్తుందని తెలిపారు.
తెలంగాణ నుండి డబ్బులు ఢిల్లీలో కుటుంబ పార్టీ పెద్దలకు వెళతాయని పేర్కొ తెలంగాణలో బిజెపికి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే .. తనకు అంత శక్తి వస్తుందని చెప్రధాని ప్పారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం పెంచడం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
నేను భారతమాత పూజారిని ” అంటూ తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అని కొనియాడారు. బిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలను దోచుకుందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసునని అంటూ బిఆర్‌ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని ఆరోపించారు.
బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని చెబుతూ బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పదేళ్లుగా వెనుకబడి పోయిందని ప్రధాని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ మీద ఆరోపణలు చేసే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపిందని ఆరోపించారు.
ఆ రెండు పార్టీలు మధ్య ఉన్న బంధాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్న విషయం గుర్తుంచు కోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయిందని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం లేదు, కాంగ్రెస్ సమాధానం చెప్పక పోవడాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రెండు పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లకు మోదీపై నిందలు వేయడం తప్ప మరొకటి తెలియదని ప్రధాని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ ఇస్తున్నాడని, తెలంగాణను దోచుకునే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మోదీ గ్యారంటీల్లో తెలంగాణను లూటీ చేసే వారిని శిక్షించడం కూడా ఉందని తెలిపారు. నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, కరీంనగర్‌లో బండి సంజయ్, పెద్దపల్లిలో శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. పోలీంగ్ కేంద్రాలకు భారీగా తరలి వెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఎక్స్‌లో తన ప్రసంగాలను “నమో ఇన్ తెలుగు” హ్యాండిల్‌లో తెలుగులో వినొచ్చని ప్రధాని మోదీ చెప్పారు. 100 శాతం తెలుగులో లేకపోయిన కనీసం 80శాతం అర్థమయ్యేలా ప్రసంగాలు తెలుగులో వినిపిస్తాయని చెప్పారు. తాను దేశంలో ఎక్కడ మాట్లాడినా ఆ ప్రసంగాలు తెలుగులో అందుబాటులో ఉంటాయని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని తెలుగు ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి