మోదీ ఏపీ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఫిర్యాదు

ఏపీలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హాజరైన బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభలో ఎక్కడి కక్కడ భద్రతా లోపాలు కనిపించాయని ఆ మూడు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలోనే లైటింగ్ టవర్స్ పై జనం ఎక్కేయడం, మైక్ సెట్ మీదకు పడిపోయి అది పని చేయకుండా ఆగిపోవడం వంటి ఘటనలు కనిపించాయి. 
 
దీనిపై స్వయంగా ప్రధాని మోదీ  జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టిసారించాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్డీయేలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ప్రధాని సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు భద్రతను గాలికొదిలేశారని వారు ఆరోపించారు. 

ఏపీ డీజీపీ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్సార్‌ ఆంజనేయులు, గుంటూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ శంకర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని, వారిని ఎన్నికలవిధుల నుంచి తప్పించాలని కోరారు. మోదీ పాల్గొన్న సభను భగ్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆకాశంలో వెళుతుంటే కింద రోడ్ల మీద పోలీసులు ట్రాఫిక్‌ ఆపుతారని, దేశ ప్రధాని పాల్గొన్న సభకు భద్రత కల్పించలేదని విమర్శించారు.

ఈ మేరకు ప్రధాని సభలో చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘనలపై వివరంగా సీఈవోకు వారు ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను ముందుగానే అందజేసినా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో ఎన్డీయే నేతలు తెలిపారు.
 
టిడిపి, జనసే, బిజెపి కూటమి బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభను భగం చేయటానికి రాష్ట్ర పోలీస్‌, ఇంటెలిజెన్స్‌శాఖలు శాయశక్తులా ప్రయత్నించాయని, స్వయాన దేశ ప్రధాని పాల్గొన్న సభలోనూ భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించటానికి ఆయా శాఖల నిర్లక్ష్య వైఖరే కారణమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) ముఖేష్‌ కుమార్‌ మీనాకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎపి బిజెపి మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. 
 
సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో సిఇఒను కలిసిన ఎన్‌డిఎ సభ్యులు ఆదివారం ప్రజాగళం సభలో జరిగిన మైకు ఇబ్బందులు, విద్యుత్‌ పోవటం, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించకపోవటం, తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు.  ప్రధాని వంటి వీవీఐపీ హాజరైన సభలో పోలీసులు స్ధాయికి తగినట్లు భద్రత కల్పించలేకపోయారని వెల్లడించారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పల్నాడు సభలో ఘటనలపై విచారణ చేయించాలని వారు కోరారు.
 
 ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభకు ట్రాఫిక్ ను నియంత్రించలేదని, పల్నాడు ఎస్పీ వైసీపీ కార్యకర్తలా పనిచేశారని ఫిర్యాదులో తెలిపారు. అలాగే నలుగురు పోలీసు అధికారులపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. వీరిని విధుల్లో కొనసాగిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని, కాబట్టి వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.