అమెరికాలో గుంటూరు విద్యార్థి దారుణ హత్య

అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తమ బిడ్డలు తిరిగి ఇంటికి చేరుతారా? అనే ఆందోళన తల్లిదండ్రులో నెలకొంది. ఇటీవల వరుసగా జరుగుతున్న దాడులతో అమెరికాలో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో  హత్యకు గురయ్యాడు. 
 
అతని మృతదేహాన్ని యూనివర్సిటీలోని ఓ అటవీ ప్రాంతంలో కారులో గుర్తించారు. దాడి చేసిన వారి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు.  డబ్బు, ల్యాప్‌టాప్ కోసం దాడి చేసి హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ (20) బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 
 
పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులకు అభిజిత్ ఏకైక కుమారుడు. అభిజిత్ తెలివైన విద్యార్థి అని కుటుంబ సభ్యులు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనే అభిజిత్ నిర్ణయాన్ని అతని తల్లి మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, భవిష్యత్తు బాగుంటుందని తన మనసు మార్చుకుని విదేశాలకు పంపడానికి ఒప్పుకుంది. అభిజిత్‌ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం గుంటూరులోని బుర్రిపాలెంలోని ఆయన ఇంటికి తరలించారు.
 
ఇటీవలె భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై అమెరికాలో దాడి జరిగింది. రక్తపు మడుగులో సాయం కోసం అతడు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఏడాది భారతీయులపై దాడి జరగడం ఇది తొమ్మిదోసారి. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాజీపేట నగరానికి చెందిన వెంకటరమణ పిట్టల  అనే విద్యార్థి జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో ఫ్లోరిడా నగరంలో జరిగింది.
 
 27 ఏళ్ల వెంకటరమణ ఇండియానా పోలీస్‌లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్నాడు. ఈ సంఘటన మార్చి 9న విస్టేరియా ద్వీపం వైపు ఉన్న ఫ్యూరీ ప్లేస్ పార్క్‌లో జరిగింది. యమహా పర్సనల్‌ వాటర్‌క్రాఫ్ట్‌(జెట్‌స్కీ)ను అద్దెకు తీసుకొని అక్కడి ఫ్లోటింగ్ ప్లే గ్రౌండ్‌లో నడుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడగా…అతడికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు వెంకటరమణ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వెంకటరమణ మరణానికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మృతదేహాం తరలింపునకు కూడా చర్యలు చేపట్టలేదని తెలిసింది.