యడియూరప్ప పోక్సో కేసు… ఆమెకు అదే అలవాటు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్ యెడియూరప్ప (81)పై పోక్సో కేసు నమోదు చేసిన 53 ఏళ్ల మహిళ గతంలో కీలకమైన పలువురు వ్యక్తులపై 52 కేసులు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులను ఆ మహిళ కలుస్తుందని, ఫొటోలు, వీడియోలు తీసి ఆ తర్వాత వారిపై ఫిర్యాదు చేస్తుందని ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. 
 
మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత వీఎస్‌ ఉగ్రప్ప, ఇద్దరు మాజీ పోలీస్‌ కమిషనర్లైన భాస్కర్‌రావు, అలోక్‌కుమార్‌తో సహా పలువురిపై ఆమె ఇప్పటివరకు 53 కేసులు పెట్టిందని పేర్కొన్నారు. ఆ మహిళ తన భర్తతోపాటు పొరుగింటి వారిపై లైంగిక దాడి కేసులతోపాటు అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీకి వ్యతిరేకంగా పోలీస్‌ కమిషనర్, డీజీ, ఐజీ కార్యాలయాల్లో పలు ఫిర్యాదులు చేసినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు.
 
కాగా, అత్యాచారం కేసులో సహాయం కోరేందుకు మాజీ సీఎం యెడియూర్పను ఫిబ్రవరి 2న ఆయన నివాసంలో ఆ మహిళ కలిసింది. ఆ సమయంలో 17 ఏళ్ల తన కుమార్తెను యెడియూరప్ప లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాలిక తల్లి సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
 ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన యెడియూరప్ప దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.  కేసును తదుపరి దర్యాప్తు కోసం సదాశివనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ డీజీపీ అలోక్‌ మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఆ మహిళ తనను కలవడానికి చాలా సార్లు ప్రయత్నించినా తాను అనుమతించలేదని యెడియూరప్ప చెప్పారు. ఒకసారి ఏడుస్తుండగా, ఆమెను లోపలికి పిలిచామని, తర్వాత పోలీస్‌ కమిషనర్‌ సదానంద్‌తో ఆమె సమస్యను చూడమని చెప్పానని తెలిపారు. అయితే తన ఎదురుగానే తనకు వ్యతిరేకంగా మాట్లాడటం చూసి ఆమె ఏదో తేడాగా ఉందని గ్రహించానని చెప్పారు.