విప‌క్ష ఇండియా కూట‌మికి భారంగా రాహుల్

విప‌క్ష ఇండియా కూట‌మికి రాహుల్ భారంగా మారార‌ని బీజేపీ సీనియ‌ర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌క్వీ విమర్శించారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన అనంత‌రం ప‌లు విప‌క్ష పార్టీలు ఈసీ నుంచి గుర్తింపు కోల్పోతాయ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.
 
 సీఏఏ అమ‌లుతో ముస్లింలు స‌హా ఏ ఒక్క భార‌త పౌరుడిపై ప్ర‌భావం ఉండ‌ద‌ని కేంద్ర మైనారిటీ వ్య‌వ‌హారాల మాజీ మంత్రి న‌క్వీ స్ప‌ష్టం చేశారు.  సీఏఏపై దేశ‌వ్యాప్తంగా మ‌త‌ప‌ర‌మైన వివాదం, గంద‌ర‌గోళం సృష్టించేందుకు విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. 
 
కాంగ్రెస్ స‌హా విపక్ష పార్టీల‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్ల‌డంతో రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భుత్వం వ‌రుస‌గా మూడోసారి అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. విప‌క్ష ఇండియా కూట‌మికి స‌రైన నాయ‌కుడు లేడ‌ని, దీటైన విధానాలు లేవ‌ని దుయ్య‌బ‌ట్టారు. అంతర్గ‌త విభేదాల‌తో విప‌క్ష కూట‌మి కొట్టుమిట్టాడుతోంద‌ని పేర్కొన్నారు.విప‌క్ష ఇండియా కూట‌మిలో ప్ర‌ధాన భాగస్వామ్య ప‌క్ష‌మైన కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ప్ర‌భుత్వం రావాల‌ని దేశ ప్ర‌జ‌లెవ‌రూ కోరుకోవ‌డంలేద‌ని న‌క్వీ స్పష్టం చేశారు. రాహుల్ విప‌క్ష కూట‌మికి భారంగా మారార‌ని, ఓట‌మి నైరాశ్యంతోనే విప‌క్ష కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల మ‌ధ్య అంత‌ర్గ‌త విభేదాలు వ్య‌క్త‌మవుతున్నాయ‌ని తెలిపారు. 

బీజేపీని ఇండియా కూట‌మి స‌వాల్ చేసే స్ధితిలో లేద‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల అనంత‌రం ప‌లు రాజ‌కీయ పార్టీలు త‌క్కువ ఓటింగ్ కార‌ణంగా త‌మ గుర్తింపును నిలుపుకునేందుకు స‌త‌మ‌త‌మ‌వుతాయ‌ని చెప్పారు.