కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం నుండి 7 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు పొందారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అనిల్‌తో పాటు కవిత పీఆర్వో రాజేశ్‌, ఆమెకు సంబంధించి ముగ్గురు సహాయకులకు కూడా నోటీసులు ఇచ్చింది. 
 
అనిల్‌తో సహా మొత్తం ఐదుగురు సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో ఈడీ పేర్కోంది. శుక్రవారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించగా ఈ సోదాల్లో కవితకు సంబంధించిన ఫోన్లతో పాటు భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, ముగ్గురు అసిస్టెంట్లకు ఫోన్లు కూడా సీజ్ చేశారు ఈడీ అధికారులు. 
 
ఇప్పుడు ఈ ఐదుగురిని కూడా సోమవారం రోజున ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారుల్లో కవిత ఒకరని, స్కామ్‌లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చేసింది. దీంతో ఈ పరిస్థితుల్లో కవిత భర్త విచారణకు వెళ్తే ఎలా ఉంటుంది? అని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.
 
 2020 ఆరంభంలో కవిత ఇంట్లో జరిగిన భేటీలో ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయిన్‌పల్లి పాల్గొన్నారు. వీరితోపాటు.. అనిల్‌ కూడా పాల్గొన్నట్లు కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు సమావేశంలో ఏం మాట్లాడారు? అనే అంశంపై అనిల్‌ను విచారించనున్నట్లు స్పష్టమవుతోంది.
 
ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసిన ఈడీ కీలక సమాచారం సేకరించిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ వేదికగా చెల్లి కోసం న్యాయ పోరాటం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కవిత భర్తకు నోటీసులు రావడంతో అనిల్‌ను వరుసగా రెండు రోజుల పాటు విచారణ చేస్తారని, తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవితకు సంబంధించిన కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి ఆమె కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ స్పష్టం చేసింది..
 
సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కవిత కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆప్ పార్టీకి రూ. 100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక సూత్ర దారి అని ఈడీ వాదిస్తోంది. అయితే కవితకి బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారని, ఆయన ద్వారానే మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించినట్లు భావిస్తున్నారు.