* ఇస్లామోఫోబియాపై పాక్ తీర్మానంపై దూరం
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా భారత అంతర్గత వ్యవహారాల గురించి ప్రస్తావించి పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకుంది. అయోధ్య రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం గురించి పాక్ ఐరాసలో అసందర్భంగా ప్రస్తావించడంతో భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు పాకిస్థాన్ సొంతం అని తీవ్రంగా మండిపడింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్ అంబాసిడర్ మునిర్ అక్రమ్ అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ, ఇటీవల భారత్ అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. మునిర్ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తీవ్రంగా స్పందించారు.
భారతదేశానికి సంబంధించిన విషయాలపై పాకిస్థాన్ ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగి ఉండటం చాలా దురదృష్టకరమని చురకలు అంటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్థాయి కలిగిన లోతైన అంశాల గురించి పరిగణిస్తుంటే పాక్ దగ్గర నుంచి మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోందని మండిపడ్డారు.
ఎప్పుడూ చెప్పిందే చెప్పే చెత్త రికార్డు కలిగిన పాకిస్థాన్ ప్రతినిధి బృందం ప్రపంచం పురోగమిస్తోన్న తరుణంలో స్తబ్ధుగా ఉండటం తీవ్ర విచారకరం అంటూ రుచిరా కాంబోజ్ పాక్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలాసార్లు భారత అంతర్గత విషయాల గురించి విదేశీ గడ్డపై ప్రస్తావించి భారత్ చేతిలో చీవాట్లు పడ్డా పాక్ తీరు మాత్రం మారడం లేదు.
జనవరి 22 వ తేదీన అయోధ్యలో దివ్య రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక ఇటీవలె సీఏఏ విధివిధానాలపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది.
గతంలో కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్థాన్ ప్రస్తావించగా భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో పాకిస్థా్న్ చేతులు తడిసిపోయాయని భారత్ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్‌కు లేదని గట్టిగా హెచ్చరించింది.
మరోవంక, ఇస్లామోఫోబియాపై పాకిస్తాన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. హిందూవాదం, బౌద్ధవాదం, సిక్కు, ఇతర మత విశ్వాసాలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ భారత్ విమర్శించింది. కేవలం ఒక మతాన్ని మాత్రమే వేరు చేయడం కన్నా ఇతర మతాలు కూడా హింస, వివక్షను ఎదుర్కొంటున్నాయని గుర్తించాలని పేర్కొంది.
ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు చర్యలు అన్న పేరుతో పాకిస్తాన్ శుక్రవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయగా, 44 దేశాలు గైర్హాజరయ్యాయి. వీటిలో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, బ్రిటన్ వున్నాయి. యూదు వ్యతిరేకత, క్రైస్తవ విద్వేషం, ఇస్లామ్ పట్ల వ్యతిరేకతతో చేపట్టే చర్యలన్నింటినీ భారత్ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ తీవ్రంగా ఖండించారు.
ఇటువంటి ఫోబియాలు ఇతర మతాలకు కూడా వున్నాయని గుర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ముస్లిమేతర మతాలు కూడా మత విద్వేషాలను ఎదుర్కొంటున్నాయనడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని ఆమె చెప్పారు.
కాలక్రమంలో మతపరమైన ఫోబియాకు సమకాలీన రూపాలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా హిందూ, బౌద్ధ, సిక్కు వ్యతిరేక భావాలు రెచ్చగొడుతున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తలెత్తుతున్న మతపరమైన వివక్ష విస్తృత రూపాన్ని కూడా సభ్య దేశాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష