ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు.. జూన్ 4న ఫలితాలు

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు.

లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్‌ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ మే 20న, ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ మే 25న, ఏడో దశ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరుగనున్నాయి. 

జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలో, ఒడిశా రాష్ట్రానికి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలతోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13న, మే 20న, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరుగనుంది.

ఇక కేవలం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ విషయానికి వస్  అరుణాచ‌ల్ ప్రదేశ్, అండ‌మాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, చండీఘ‌ర్, డామ‌న్ డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్రదేశ్, హ‌ర్యానా, కేర‌ళ‌, ల‌క్షద్వీప్, ల‌డ‌ఖ్, మిజోరం, మేఘ‌లాయ‌, నాగ‌లాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త‌మిళ‌నాడు, పంజాబ్, తెలంగాణ‌, ఉత్తరాఖండ్లలో సింగిల్‌ ఫేజ్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

అదేవిధంగా క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్, త్రిపుర‌, మ‌ణిపూర్‌లలో రెండు దశల్లో, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, అసోం రాష్ట్రాల్లో మూడు దశల్, ఒడిశా, మ‌ధ్యప్రదేశ్‌, జార్ఖండ్ లలో ఐదు దశల్, మ‌హారాష్ట్ర‌, జ‌మ్ముక‌శ్మీర్‌లలో ఆరు దశల్లో, ఉత్తర‌ప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ రాజీవ్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. 

కాగా, జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఆరేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని  రాజీవ్ కుమార్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న పోలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు.

మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 412 జనరల్‌ స్థానాలు కాగా, 84 ఎస్సీ రిజర్వ్‌డ్‌, 47 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు.