తెలంగాణలోనూ బిజెపి గాలి వీస్తుంది

మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఇప్పటికే దేశ ప్రజలు ఫలితం నిర్ణయించారని, మరోసారి మోదీ సర్కార్ అని దేశం నిర్ణయించందని చెబుతూ తెలంగాణలోనూ అదే గాలి వీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లను సాధించి తెలంగాణాలో సంచలనం సృష్టించిన బిజెపి ఈసారి రెండంకెల సంఖ్యను దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ శుక్రవారం సాయంత్రం మల్కాజ్ గిరిలో తలపెట్టిన భారీ రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రి రాజ్ భవన్ లో బస చేసిన అనంతరం శనివారం నాగర్ కర్నూలులో పార్టీ తలపెట్టిన భారీ సభలో పాల్గొంటూ  నాగర్ కర్నూలు ప్రజలు కూడా ఈ సారి బిజెపిని గెలిపించాలని ప్రజలను కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో బిజెపి ర్యాలీ బ్రహ్మాండంగా సాగిందని చెప్పారు. 
 
మల్కాజ్ గిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి బిజెపికి మద్దతు తెలిపారని ప్రధాని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పట్ల తమ కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్న ప్రధాని సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కూడా బిజెపినే గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణ కూడా అబ్ కీ బార్ – 400 నినాదం చేస్తోందని తెలిపారు.
 
“తెలంగాణలోని ప్రజలు బీఆర్ఎస్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న విషయాన్ని మొన్నటి ఎన్నికల్లో గమనించాను. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. తెలంగాణను గేట్ వే ఆఫ్ సౌత్ గా పిలుస్తారు. గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే సర్కార్ కృషి చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారాయి” అని తెలిపారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఈ రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల సమయం కూడా పట్టదని ప్రధాని హెచ్చరించారు. వారి ఆటలు సాగవద్దంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. అన్ని స్థానాల్లోనూ కమలం అభ్యర్థులను గెలిపించండని ప్రధాని పిలుపిచ్చారు. 
 
బిజెపి అభ్యర్థులను గెలిపిస్తూ వారు మీ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తారని చెబుతూ మీ సమస్యలను పరిష్కరించి మీకు అండగా ఉంటానని ప్రధాని హామీ ఇచ్చారు. ఏడు దశాబ్ధాల పాటు దేశాన్ని దోచుకోవటం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా మార్చుకుందని ధ్వజమెత్తారు. 
 
మార్పునకు గ్యారెంటీ కేవలం మోదీనే అని చెప్పారు. పదేళ్ల కాలంలో అనేక మంది పేదలకు మంచి పనులు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు పథకాలను ప్రస్తావించారు ప్రధాని. తమ చర్యలతో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ మరింత మార్పులు వచ్చేందుకు మోదీ  సర్కార్ మరోసారి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 
 
తెలంగాణ ప్రజల కలలను రెండు పార్టీలు ధ్వంసం చేశాయని ప్రధాని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గరీబ్ హఠావో నినాదం ఇచ్చింది కానీ… పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. కానీ మోదీ పాలనలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబమని మరోసారి పునరుద్ఘటించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. దళితబంధు స్కీమ్ పేరుతో దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ అడుగు జాడల్లో నడిచే పార్టీ అని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చెప్పి  అంబేడ్కర్ ను అవమానించారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పిందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలని పేర్కొంటూ కాంగ్రెస్ 2 జీ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని మోదీ ఆరోపించారు. తెలంగాణలో దళిత నేతను కింద కూర్చబెట్టారంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మోదీ బడగు బలహీనవర్గాలను మోసం బీఆర్ఎస్,  కాంగ్రెస్  పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు.