భూకబ్జాల రక్షణకై కాంగ్రెస్ నేతలతో మల్లారెడ్డి భేటీలు!

నిత్యం వివాదాస్పద వాఖ్యలతో వార్తలలో నిలిచే మాజీ మంత్రి, బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్యెల్యే  మల్లారెడ్డి, ఎమ్యెల్యే అయిన తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి,  కుమారుడు భద్రారెరెడ్డిలతో కలిసి ఫిరాయింపుల రాజకీయాలలో ఆరితేరిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను బెంగుళూరులోని ఓ హోటల్ లో కలిసిన్నట్లు ఫోటోలు వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపుతోంది. 
 
మొన్నటి వరకు కుమారుడికి  మల్కాజ్ గిరి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చిన ఆయన మూడు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసి సీటు అవసరం లేదని చెప్పారు.  ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికో లేదా ఆ పార్టీలో చేరేందుకు శివకుమార్ ను కలిసారని ప్రచారం జరుగుతుంది. 
 
అయితే తాను బెంగుళూరులో ఓ యూనివర్సిటీని కొనుగోలు చేసే విషయంలో కలిశానని, పార్టీ మారే ఉద్దేశ్యం లేదంటూ ఓ ప్రకటన చేశారు. పైగా, తన ఎమ్యెల్యే పదవి కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల నుండి విరమించుకుంటానని కూడా వెల్లడించారు.  మరోవంక, శివకుమార్ ద్వారా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులు కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
రేపోమాపో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని కూడా చెబుతున్నారు. 2014లో టిడిపి ఎంపీగా గెలుపొందిన ఆయన ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత 2018లో ఆ పార్టీ నుండి ఎమ్యెల్యేగా గెలుపొంది మంత్రివర్గంలో చేరారు. మంత్రిగా ఉంటూ నిత్యం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తుండేవారు.
 
తరచూ సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతూ ఉండెడివి. బస్తేనే సవాల్ అటు తొడలు కొట్టిన రోజులుకూడా ఉన్నాయి. మల్లారెడ్డి పలు భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ బిఆర్ఎస్ నేతలు నుండే ఆరోపణలు వస్తుండెడివి. ఈ పూర్వరంగంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఆక్రమించిన భూములపై ఓ కన్నేసినట్లు కనిపిస్తున్నది. ఈ మధ్యనే  చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటి కళాశాల గదులను కూల్చివేశారు.
 
గతంలో చిన్నదామర చెరువులో ఎరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటి కళాశాలలో స్థలాలు ఆక్రమించినట్లుగా ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించిన కలెక్టర్ అధికారులకు కూల్చివేతలు చేపట్టాలని ఆదేశించారు.
 
ఈ కూల్చివేతలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు సమావేశమయ్యారు మల్లారెడ్డి. దానితో పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారనే వార్తలు బలంగా వినిపించాయి.  మొదట్నుంచి మల్కాజ్ గిరి ఎంపీ సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన మల్లారెడ్  తాజా పరిణామాలతో వెనక్కి తగ్గారు. తన కుమారుడు భద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని… మల్కాజ్ గిరి స్థానానికి భద్రారెడ్డి పేరును పరిశీలించవద్దని కేటీఆర్ కు తెలిపారని తెలిసింది.
 
తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారాన్ని కొట్టివేసినప్పటికీ మల్లారెడ్డి తన ఆస్తులను కాపాడుకోవటానికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ కేంద్ర అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లు చెబుతున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలయిన తర్వాత గులాబీ నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.