చేవెళ్లలో భారీ మెజారిటీతో బీజేపీ గెలుపు తధ్యం

ప్రధాని నరేంద్ర మోదీ పై నమ్మకంతోనే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని మాజీ ఎంపీ, అక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో తమ మోందాటి రౌండ్ ప్రచారం అయిపోయిందని తెలిపారు. చేవెళ్లలో సర్వే చేయించామని, గెలిచేది బీజేపీయేనని స్పష్టమైందని వెల్లడించాయిరు. 
 
చేవెళ్ల సీటు మోదీదేనని.. ఇది రాసి పెట్టుకోవచ్చని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడంతో అలా అనుకున్నారని పేర్కొన్నారు. 
 
లిక్కర్ కేసులో రాష్ట్రానికి చెందిన డబ్బులు ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారినా కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ, సర్పంచులు, అంతకంటే పైస్థాయిలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 
 
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంపై స్పందిస్తూ ఆయన తనకు మంచి మిత్రుడని కొండా తెలిపారు. ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమని చెబుతూ వ్యక్తిగతంగా డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరూ పెద్ద నేతలే అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల అభ్యర్థులు దొరకట్లేదని,  అందుకే టికెట్ రాని ఇతర పార్టీల నేతలవైపు చూస్తున్నారని విమర్శించారు.

జితేందర్ రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని పేర్కొంటూ మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీలోకి వస్తారన్నా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. నల్గొండ, ఖమ్మంలో కూడా బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గంలోనే విజయం సాధిస్తామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
 
 తెలంగాణలో బిజెపి 12కుపైగా ఎంపీ సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని, కానీ, కొన్ని పార్టీలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ముస్లింలు పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దేశంలోని ఏ ముస్లింకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని ఎవరూ ఊహించలేదని, కానీ, మోదీ మోడీ చెబితే చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన తెలిపారు. సిద్ధాంతం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. కొన్ని పార్టీలు అవసరాలకు అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకుంటాయని విమర్శించారు.