సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్ నంబర్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 కింద భారత పౌరసత్వం దరఖాస్తుదారుల కోసం త్వరలో హెల్ప్‌లైన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది. 
 
దరఖాస్తుదారులు ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన సంవత్సరాన్ని తప్పనిసరిగా ప్రకటించాలి. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారత్‌కి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలాంటి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడమే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 ముఖ్య ఉద్దేశం. 
 
సీఏఏ -2019కి సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు దరఖాస్తుదారులు దేశంలోని ఎక్కడి నుంచైనా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సేవ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది. 
 
పాకిస్థాన్, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి.. 2014 డిసెంబరు 31కి ముందు ఇక్కడికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులు భారతపౌరసత్వం మంజూరు కోసం https:/indiancitizenshiponline.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 
 
దర్యాప్తు సంస్థలు బ్యాక్‌గ్రౌండ్‌ పరిశీలన పూర్తిచేసిన తర్వాత వాటిని ప్రాసెస్‌ చేస్తారు. నిర్దేశిత అధికారి నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ ద్వారా సాధికార కమిటీకి ఈ దరఖాస్తును సమర్పిస్తారు. ఈ చట్టం ఎలాంటి పత్రాలు లేనివారి కోసం ఉద్దేశించినందున, దరఖాస్తుదారులు అంతకుముందు తాము నివసించిన దేశాల్లో (పాక్‌, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌) అక్కడి ప్రభుత్వాలు జారీ చేసిన ఏవైనా పత్రాలను అప్‌లోడ్‌ చేయవచ్చు.
సీఏఏ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఆయా దేశాల్లో తమకు ప్రస్తుతం ఉన్న పౌరసత్వాన్ని వదులుకోవడంతో పాటు భారతదేశాన్ని శాశ్వత చిరునామాగా అంగీకరిస్తూ డిక్లరేషన్‌ ఇవ్వాలి. విధేయతతో కూడిన ప్రమాణం కూడా చేయాల్సి ఉంటుంది. 
 
అలాగే వారు హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందినవారని, ప్రస్తుతం ఆయా మతాల్లోనే కొనసాగుతున్నారని ధ్రువీకరిస్తూ గుర్తింపు పొందిన ఏదైనా స్థానిక సంస్థ జారీ చేసిన అర్హత సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వీటితో పాటు పౌరసత్వం కోసం ఈ కింది పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించవచ్చు. 
 
పాక్‌, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్‌, జనన ధ్రువీకరణ పత్రం/ ఏదైనా లైసెన్స్‌/ భూమి లేదా కౌలు రికార్డులు, స్టడీ సర్టిఫికెట్లు, అక్కడి ప్రభుత్వాలు మంజూరు చేసిన మరేదైనా గుర్తింపు పత్రంతో పాటు దరఖాస్తుదారుని తల్లిదండ్రులు లేదా తాతలు, ముత్తాతల్లో ఒకరు ఆయా దేశాలకు చెందినవారని నిరూపించే ఏదైనా పత్రం, దరఖాస్తుదారులు ఆయా దేశాల నుంచి వచ్చినట్లు నిర్ధారించేందుకు అక్కడి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఏ పత్రాన్నయినా ఆమోదిస్తారు. 
 
ఒకవేళ వాటి కాలపరిమితి దాటినా కూడా అవి చెల్లుబాటు అవుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు.  దరఖాస్తుదారుడు 2014, డిసెంబరు 31 కంటే ముందే భారతదేశంలోకి ప్రవేశించినట్లుగా రుజువు చేసేందుకు ఈ పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
 
 భారత్‌కు వచ్చిన సమయంలోని వీసా కాపీ, ఇమిగ్రేషన్‌ స్టాంప్‌ కాపీలు, గ్రామీణ, పట్టణ సంస్థలకు ఎన్నికైన సభ్యులు లేదా రెవెన్యూ అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, భారత్‌లో జన గణన సమయంలో ఎన్యూమరేటర్లు జారీ చేసిన స్లిప్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, స్కూల్‌ టీసీ, విద్యార్హత సర్టిఫికెట్లు, వ్యాపార లైసెన్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌-6బీ కింద పౌరసత్వం పొందినవారిని దేశంలో ప్రవేశించిన తేదీ నుంచి భారత పౌరులుగా పరిగణించనున్నట్లు ఎంహెచ్‌ఏ వెబ్‌సైట్‌లో పేర్కొనడంపై కేంద్ర హోంశాఖ అధికారులు స్పందించారు. సీఏఏ కింద అర్హులైన వారికి చట్టంలో పేర్కొన్న ప్రకారం రెట్రోస్పెక్టివ్‌ విధానంలో పౌరసత్వం మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఇలా సీఏఏ అమలుపై కేంద్రం పలు నిబంధనలు విధించింది.