హోదా విషయంలో తప్ప బిజెపితో తగాదా ఏమీ లేదు

ప్రత్యేక హోదా విషయంలో తప్ప బీజేపీతో గతంలో తమకెలాంటి తగాదా లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భావోద్వేగంతో హోదా అడిగామని చెబుతూ  బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప రాష్ట్రానికి అన్నీ తెచ్చామని చెప్పారు. రాష్ట్రానికి రావలసిన వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటామని, ప్రయత్నం మానేది లేదని తేల్చిచెప్పారు.
 
ప్రత్యేక హోదా కోసం 2018లో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చానని చెబుతూ ఇప్పుడు కూడా హోదా కావాలని, విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించొద్దని అడుగుతున్నామని వెల్లడించారు.   కేంద్రంలో బిజెపినే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం సీట్ల కేటాయింపులో తాము రాజీపడ్డామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యమని, వైసిపి విముక్త రాష్ట్రం కోసం జనసేన, బిజెపితో కలిశామని తెలిపారు.  జగన్‌ విధ్వంస పాలనతో కుప్పకూలిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడానికే మూడు పార్టీలం పొత్తు పెట్టుకున్నామని చెబుతూ ఇది రాష్ట్రం కోసం కుదిరిన పొత్తు తప్ప వ్యక్తుల కోసమో, పదవుల కోసమో కుదిరింది కాదని చెప్పారు.
 
తాను ఎన్‌డిఎ నుండి బైటకు రావడం వల్లన రాష్ట్రం నష్టపోయిందని పేర్కొంటూ కొనసాగి ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన హయాంలో పోలవరం నిర్మాణం 72 శాతం పూర్తయిందని గుర్తు చేశారు. 
విభజన చట్టంలో ఉన్న విద్యాసంస్థలతో పాటు వెనకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు సాధించామని చెప్పారు. కానీ వైసిపి ప్రభుత్వం ఈ నిధులను కూడా తీసుకురాలేదని విమర్శించారు. 
 
వైసీపీ దెబ్బకు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని, మళ్లీ ముందుకు రావాలంటే కేంద్రం సహకారం అవసరమని స్పష్టం చేశారు. బీజేపీ లేకుండా తాను గెలిచిన తర్వాతైనా వారి సహకారం అవసరమని తెలిపారు.  ‘ప్రతిపక్షం విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తాను గెలుస్తానని జగన్‌ ఆశ. దాని కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. తక్కువ సీట్లకు ఒప్పుకొంటున్నారని జనసేన, బీజేపీ పార్టీలను రెచ్చగొట్టాలని చూశారు. పరోక్షంగా వాటిపై ఒత్తిడి తేవాలని చూశారు’ అని చంద్రబాబు తెలిపారు. 
 
వైసీపీ విముక్త రాష్ట్రం సాధిస్తానని ప్రకటించిన పవన్‌ ఆ మాట నిలుపుకోవడం కోసం పొత్తులో కొంత తగ్గారని కొనియాడారు. `మేం ఎవరం అహంభావంకు పోలేదు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశానని నేను బింకంతో కూర్చోలేదు. ప్రజల కోసం అందరం తగ్గాం. టీడీపీకి పొత్తులు కొత్త కాదు. వాజపేయి హయాంలోనే ఎన్డీయేలో ఉన్నాం’ అని చెప్పారు.
 
‘వైసీపీ మళ్లీ గెలిస్తే ఈ రాష్ట్రం వదిలిపోవాలని కొందరు అనుకుంటున్నారు. వారిలో అంత అభద్రత నెలకొంది. అటువంటి పరిస్థితులను రూపుమాపి.. మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికే ఈ పొత్తులు. దీనిని అందరూ గుర్తించాలి’ అని కోరారు. కేంద్ర సహకారంతోపాటు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అవసరమని, లేదంటే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు.