సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి.
ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. పలువురు ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే, సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తాము అమలుపరచబోమని కొందరు ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనల పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ మన రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని అమిత్ షా గుర్తు చేశారు.
చట్టం, దానిని అమలు చేసే అధికారం కేంద్రానిదే తప్ప రాష్ట్రాలకు లేదని స్పష్టం చేశారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటుకు అన్ని అధికారాలను ఇస్తుందని చెబుతూ ఎన్నికల తర్వాత అందరూ సహకరిస్తారని భావిస్తున్నానని తెలిపారు.
ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని తేల్చి చెబుతూ రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం మాత్రం విభజన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటూ భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్న ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినదని షా వెల్లడించారు.
ఇదే సందర్భంలో విపక్షాలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు ఏ పనీ లేదని పేర్కొంటూ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్‌ను కూడా స్వార్థ రాజకీయాల కోసం చేసినట్లు వారు విమర్శిస్తుంటారని మండిపడ్డారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదా..? అని షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దును కూడా రాజకీయ లబ్ధి కోసం చేసినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయని అమిత్ షా మండిపడ్డారు.
తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని, మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయడం అసాధ్యమని షా తేల్చి చెప్పారు. ‘భారత్ కూటమికి కూడా తాము అధికారంలోకి రాలేమని తెలుసు. సీఏఏ తెచ్చింది బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయడం అసాధ్యం. మొత్తం మీద దీనిపై అవగాహన కల్పిస్తాం. కాబట్టి దానిని రద్దు చేయాలనుకునే వారికి స్థానం లభించదు” అని షా స్పష్టం చేశారు.
భారత పౌరసత్వం కోసం అందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. అది ఆర్టికల్ 14కు ఎలాంటి భంగం కలిగించదని వెల్లడించారు. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
“వారు ఎప్పుడూ ఆర్టికల్ 14 గురించే మాట్లాడతారు. ఆ ఆర్టికల్‌లో రెండు క్లాజులు ఉన్నాయని వారు మర్చిపోతారు. ఈ చట్టం ఆర్టికల్ 14 ను ఉల్లంఘించదు. ఇక్కడ స్పష్టమైన, సహేతుకమైన వర్గీకరణ ఉంది. ఇది విభజన కారణంగా మిగిలిపోయిన వారికి సంబంధించిన చట్టం.ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మతపరమైన హింసను ఎదుర్కొంటు భారతదేశానికి రావాలని నిర్ణయించుకున్న వారికోసం చేసిన చట్టం” అని వివరించారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఏఏ ను నోటిఫై చేశామని చేస్తున్న ప్రతిపక్షాల ఆరోపణపై షా స్పందిస్తూ, కరోనా కారణంగా చట్టం నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్పారు.“మొదట నేను టైమింగ్ గురించి మాట్లాడతాను.రాహుల్ గాంధీ, మమత లేదా కేజ్రీవాల్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఝూత్ కీ రాజనీతి (అబద్ధాల రాజకీయాలు)లో మునిగి తేలుతున్నాయి కాబట్టి సమయపాలన ప్రశ్న తలెత్తదు” అని తెలిపారు.
బీజేపీ తన 2019 మేనిఫెస్టోలో సీఏఏని తీసుకువస్తామని, శరణార్థులకు (పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి) భారత పౌరసత్వాన్ని అందిస్తామని స్పష్టం చేసిందని హోంమంత్రి గుర్తు చేశారు.బిజెపికి స్పష్టమైన ఎజెండా ఉందని చెబుతూ, ఆ వాగ్దానం ప్రకారం, పౌరసత్వ (సవరణ) బిల్లు 2019లో పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదించబడిందని తెలిపారు.
కరోనా కారణంగా అమలు ఆలస్యమైనప్పటికీ ఎన్నికలకన్నా చాలా ముందుగానే బిజెపి తన ఎజెండాను స్పష్టం చేస్తూ వచ్చిమదని పేర్కొన్నారు.“నిబంధనలు ఇప్పుడు లాంఛన ప్రాయంగా మారాయి. సమయపాలన, రాజకీయ లాభం లేదా నష్టం అనే ప్రశ్న లేదు. ఇప్పుడు, ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ తమ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసుకోవాలనుకుంటున్నాయి. అవి బహిర్గతమయ్యాయి.” అని విమర్శించారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి