ఎన్నికల కమిషనర్లగా జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమించారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రియను చేపట్టింది. 
 
ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. దీంతో రెండు ఎన్నికల కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. తాజాగా ఆ పదవులనే భర్తీ చేశారు.
 
జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారులు. పంజాబ్‌కు చెందిన సంధు ఉత్తరాఖండ్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్‌కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు. 
 
జ్ఞానేష్‌ కుమార్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. కాగా, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు గురువారం ఉదయం సమావేశమైంది.