అగ్ని-5 ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

* ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తాజాగా మరో ఘనతను దక్కించుకుంది. పూర్తిగా భారత దేశ సాంకేతికతతో తయారు చేసిన మిషన్ దివ్యాస్త్రను మొదటిసారి విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇప్పటివరకు ఉన్న అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు ఉన్న మిస్సైల్స్ కంటే ఈ అగ్ని-5 మిస్సైల్ మరింత దూరంలో ఉన్న లక్ష్యాలను మరింత ఖచ్చితత్వంతో చేరుకుంటుందని డీఆర్‌డీఓ అధికారులు స్పష్టం చేశారు.

‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భారత్‌ కీలక మైలురాయిని చేరుకుంది. ఎంఐఆర్వీ సాంకేతికతతో.. 5 వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే.. ఏకకాలంలో ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా బహుళ రీ-ఎంట్రీ వాహనాలను(వార్‌హెడ్‌లు) ప్రయోగించడం.

ఇప్పటి వరకు ఎంఐఆర్వీ టెక్నాలజీ ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ ఉన్నాయి. అగ్ని-5తో పరీక్షించిన ఎంఐఆర్వీ విజయవంతం అవ్వడంతో.. ఆ దేశాల సరసన భారత్‌ చేరింది. పాకిస్థాన్‌ 2017లో 2,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ‘అబాబీల్‌’ మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఎంఐఆర్వీ టెక్నాలజీతో పరీక్షించింది. ఇంటర్మీడియట్‌ రేంజ్‌ క్షిపణి అయిన అగ్ని-5 ద్వారా భారత్‌ ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది.

ఇది మన దేశానికి అందుబాటులోకి రావడంతో భారత రక్షణ, ఆయుధ వ్యవస్థ మరింత బలోపేతంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎంఐఆర్వీ సాంకేతికతను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించడంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.  ‘డీఆర్‌డీవో మరో ఘనత సాధించింది. ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల ఎంఐఆర్వీని ‘అగ్ని-5’ క్షిపణిపై విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ప్రశంసించారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందని ప్రధాని కొనియాడారు.

‘‘ఈ ఘనత దేశ రక్షణతోపాటు.. వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ముర్ము ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మిషన్ దివ్యాస్త్రను ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌’ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఈ మిషన్ దివ్యాస్త్రలోని ఒకే మిస్సైల్ సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ఒకేసారి ప్రయోగించవచ్చని డీఆర్‌డీఓ అధికారులు వివరించారు.

సాధారణంగా క్షిపణులను ఇంటర్‌సెప్ట్‌ చేసి, వాటిని గాల్లోనే ధ్వంసం చేసే సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది. ఇటీవల హమాస్‌ దాడుల తర్వాత.. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వ్యవస్థ పతాక శీర్షికలకెక్కింది. అయితే.. ఎంఐఆర్వీ సాంకేతికతలో అలా ఇంటర్‌సెప్ట్‌ చేయడం దాదాపు అసాధ్యమే..!  బాలిస్టిక్‌ క్షిపణులు లక్ష్యాన్ని చేరేముందు భూ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తాయి. లక్ష్యాన్ని చేరడానికి తిరిగి భూ వాతావరణంలోకి రావడాన్ని రీ-ఎంట్రీ అంటారు. భారత్‌ అభివృద్ధి చేసిన ఎంఐఆర్వీలో.. క్షిపణి ప్రయోగం జరిగాక.. టార్గెట్లను నిర్దేశించిన వార్‌హెడ్‌లు భూవాతావరణంలోకి రీ-ఎంట్రీ అయితే.. వాటిని నిరోధించడం శత్రుదేశాలకు సాధ్యమయ్యే పనికాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. భారత ఎంఐఆర్వీలో అన్ని వార్‌హెడ్లకు గైడెడ్‌, కంట్రోలింగ్‌, ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలున్నాయి. ‘‘మన ఎంఐఆర్వీలకు కచ్చితత్వంతో దూసుకుపోయేలా సెన్సర్లున్నాయి. వార్‌హెడ్లు ఒక్కసారి రీ-ఎంట్రీ అయితే.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. చైనా ఉత్తరభాగంతోపాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, ఆసియా మొత్తం అగ్ని-5 క్షిపణి పరిధిలో ఉంటుంది’’ అని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు తెలిపారు.

‘‘ఈ వార్‌హెడ్‌లు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇందుకోసం అగ్ని-5లో బహుళ వార్‌హెడ్‌లను అమర్చేందుకు వీలుంటుంది. న్యూక్లియర్‌ వార్‌హెడ్లను కూడా ఎంఐఆర్వీలో తరలించవచ్చు. భారత్‌ ఒక్కసారి ఎంఐఆర్వీతో ఎదురుదాడి చేస్తే శత్రుదేశాలకు కోలుకోని దెబ్బ తప్పదు’’ అని డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ జనరల్‌, ప్రస్తుతం నీతి ఆయోగ్‌ శాస్త్ర సాంకేతిక విభాగం సభ్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్‌ వీకే సారస్వత్‌ వెల్లడించారు.

అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అయిన అగ్ని-5కి.. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం ఉంటుంది. మన పొన చైనా వద్ద డాంగ్‌ఫెంగ్‌-41 వంటి మిస్సైల్స్ ఉన్నాయి. డాంగ్ ఫెంగ్ మిస్సైల్స్ 12 వేల కిలోమీటర్ల నుంచి 15 వేల కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. వాటిని దృష్టిలో ఉంచుకుని.. భారత్ ఈ అగ్ని-5 క్షిపణిని రూపొందించింది.

అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం వరకు ఉన్న మిస్సైల్స్ అన్నీ 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకుంటాయి. అవి ఇప్పటికే మన సైనిక బలగాల అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అత్యాధునిక ఆయుధ వ్యవస్థ అని తెలుస్తోంది. అయితే ఈ టెక్నాలజీ కలిగిన దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ సంఖ్యలో ఉండగా, ఆ దేశాల సరసన ప్రస్తుతం భారత్‌ చేరింది.